విలీనం వార్తలు ఉత్తవే: కెసిఆర్, బిజెపికి చురకలు

పార్లమెంటు నుంచి సస్పెన్షన్‌కు గురైన పార్లమెంటు సభ్యులు వెంటనే కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి ఉద్యమంతో కలిసి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరితే పార్లమెంటు నుంచి గెంటేశారని, ఇది తెలంగాణకు అవమానమని, తెలంగాణ ప్రజలకు అవమానమని ఆయన అన్నారు. తెలంగాణ బిడ్డలయితే అక్కడి నుంచి తప్పుకుని ఇక్కడికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వికారాబాదులో జరిగిన బహిరంగ సభలో ఆయన శుక్రవారం ప్రసంగించారు.
తెరాస ఏర్పడినప్పుడు ఆరు నెలల్లో ఆగమైపోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారని, కానీ తెరాస ఆగం కాలేదని, ఉద్యమాన్ని ముందుకు సాగుతోందని, తెలుగుదేశం పార్టీయే ఆగమైందని ఆయన అన్నారు. 11 ఏళ్లు నభూతో నభవిష్యత్తు అనే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని తెరాస ముందుకు నడిపించిందని ఆయన అన్నారు. రాజీ పడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
కాంగ్రెసులో తెరాస విలీనమవుతుందని ప్రచారం చేస్తున్నాయని, సీమాంధ్ర పత్రికలకు తెరాసపై అమితమైన ప్రేమ అని, తెరాస ఏ పార్టీలోనూ విలీనం కాదని ఆయన స్పష్టం చేశారు. అవాకులు చెవాకులు పేలే మీడియాను పట్టించుకోవద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు, తెలంగాణ పునర్నిర్మాణం కూడా తెరాస బాధ్యత అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు, గిరిజనులకు రావాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సాధిస్తామని, అద్భుతంగా తీర్చిదిద్దడానికి కూడా తమ పార్టీ పని చేస్తుందని ఆయన అన్నారు.
జాతీయ పార్టీలు లేనిది తెలంగాణ వస్తుందా అని అంటున్నారని, అవి పేరుకే జాతీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీలదే హవా, ప్రాంతీయ పార్టీలు కూర్చోబెడితేనే కేంద్రంలో అధికారం చేస్తున్నాయని, జాతీయ పార్టీలు తమంత తాముగా అధికారంలోకి వచ్చే స్థితి లేదని, తెరాస బలం పెంచుకుని జాతీయ స్థాయిలో తన సత్తా చాటి కేంద్రం మెడలు వంచుతుందనే ఆశ తనకు ఉందని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాలు లేవు, జాతీయ పార్టీలు లేవని, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేవి ప్రాంతీయ పార్టీలేనని ఆయన అన్నారు. తెలంగాణలో తమతో పోటీ పడుతున్న బిజెపికి ఆయన ఆ విధంగా చురక అంటించారు.
తెరాస 2001 ఏప్రిల్ 27వ తేదీన ఆవిర్భవించినప్పటి నుంచి సంభవించిన పరిణామాలను ఆయన వివరించారు. డ్రామాలు ఆడి వచ్చిన తెలంగాణను సమైక్యవాదులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. సమైక్యవాదుల రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం వెనకంజ వేసి నయవంచనకు పాల్పడిందని ఆయన విమర్శించారు. 1995 నుంచి తెలంగాణ కోసం ప్రయత్నాలు జరిగాయని, వాటిని ప్రభుత్వం అణచివేసిందని, కానీ 2001లో ఏర్పడిన తెరాస మొక్కవోని ధైర్యంతో లక్ష్య సాధన కోసం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
వికారాబాదులోని అనంతగిరి కొండలను, టీబీ ఆస్పత్రిని కోస్తాంధ్ర ప్రభుత్వం ధ్వంసం చేసిందని, మూసీ నదిని కాలుష్యం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వికారాబాద్ జిల్లా ఏర్పడుతుందని ఆయన చెప్పారు. అనంతగిరి కొండలకు, టీబీ ఆస్పత్రికి, మూసీ నదికి పూర్వ వైభవం తెస్తామని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు మిత్రద్రోహానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఫలితాలు తారుమారయ్యాయని, అయినా తాము కలపర పడకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ విషయంలో దుర్మార్గం చేసిందని, అందువల్ల పార్లమెంటు నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు ఇప్పటికైనా ఆ పార్టీని వీడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications