ఏ పార్టీలో చేరేది చెప్తా, సినిమా తీస్తా: కృష్ణంరాజు

తన సొంత జిల్లాలో కృష్ణం రాజు జగన్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను తీసుకోనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన ఇటీవల కాకినాడ, నర్సాపురం నేతలతో మంతనాలు జరిపారని అంటున్నారు. జగన్ పార్టీలో చేరే అంశం, ప్రచార బాధ్యతలు నిర్వహించే అంశంపై ఆయన వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలోనే ఆయన తన వర్గంతో తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని స్వగ్రామం మొగల్తూరులోని తన నివాసంలో తన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.ప్రజల ఇబ్బందులను చూస్తే మళ్లీ రాజకీయాలలోకి రావాలనిపిస్తోందని ఆయన చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికలలో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కాగా కృష్ణం రాజు గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి హయాంలో పని చేశారు. 2004 తర్వాత కూడా ఆయన బిజెపిలో కొనసాగారు. ఆ తర్వాత క్రమంగా బిజెపికి దూరమయ్యారు. 2008లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో అందులో చేరారు. బిజెపి అగ్రనాయకత్వం బాగానే ఉందని, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వల్లనే తాను బిజెపిని వీడినట్లు ఆయన చెప్పారు.
2009 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి నుండి చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు నటులు ఓడిపోయి, ఉండవల్లి గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో కృష్ణం రాజు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు.












Click it and Unblock the Notifications