కాంగ్రెసు అభ్యర్థులు వీరే, ఐదు స్థానాలు పెండింగ్

13 స్థానాలకు ఖరారైన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది - ఎమ్మిగనూరుకు రుద్రా గౌడ్, ఒంగోలుకు మాగుంట పార్వతమ్మ, రైల్వే కోడూరుకు ఈశ్వరయ్య, ఆళ్లగడ్డకు గంగుల ప్రతాపరెడ్డి, తిరుపతికి వెంకటరమణ, ఉధయగిరికి ప్రసన్న కుమార్ రెడ్డి, రామచంద్రాపురానికి తోట త్రిమూర్తులు, నర్సాపురానికి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోలవరానికి శ్రీనివాసరావు, నర్సన్నపేటకు ధర్మాన రాందాసు, పత్తిపాడుకు సుధాకర్ బాబు, మాచర్లకు కుర్రి పున్నారెడ్డి, రాయదుర్గం స్థానానికి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఈ జాబితాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, అధిష్టానం పెద్దలు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్ సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. బొత్స సత్యనారాయణ కేంద్ర మంత్రి వాయలార్ రవితో సమావేశమయ్యారు. కాగా, రాయచోటి, అనంతపురం స్థానాల్లో ఒక్కదాన్ని ముస్లింలకు, ఒక్కదాన్ని బలిజ సామాజిక వర్గాన్ని కేటాయించాలని రాష్ట్ర నాయకుల నుంచి సూచన వస్తోంది. దీంతో రాయచోటికి ముఖ్యమంత్రి ఖరారు చేసిన అభ్యర్థిని పక్కన పెట్టేసి అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రాయచోటి సీటుకు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కేటాయించాలని సూచించారు. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పరకాల సీటుకు కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి భార్య జ్యోతికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, వరంగల్ జిల్లా నాయకులు కొంత మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రాజంపేటకు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేశారు. దీంతో రాయచోటి, రాజంపేట స్థానాల్లో ఏదో ఒక్క స్థానం అభ్యర్థి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే, తిరుపతి సీటు టికెట్ మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్‌కు దక్కలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నించినప్పటికీ జయదేవ్‌కు సీటు రాలేదు. తిరుపతికి వెంకటరమణ, శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట నియోజకవర్గానికి ధర్మాన రాందాసు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా గాంధీని కలుస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications