కర్నాటకలో ముసలం: యడ్డీ రాజీనామా, మంత్రులూ..

మరుక్షణంలోనే సదానందకు హైకమాండ్ నుంచి పిలుపు రావడం, ఉన్న పళంగా ఆయన ఢిల్లీకి బయలుదేరారు. శనివారం శరవేగంగా జరిగిపోయిన ఈ వరస పరిణామాలు సదానంద సర్కారుకు ప్రమాద ఘంటికలు మోగించినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతకుముందు.. సదానందగౌడపై ఏకంగా ఏడుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఆయన నాయకత్వంపై తమకు విశ్వాసం లేదంటూ శనివారం రాత్రి రాజీనామాలు చేశారు.
వాటిని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సమర్పించి ఆయన పట్ల విధేయత చాటుకున్నారు. వారి బాటలో మరో ఇద్దరు మంత్రులు సోమవారం రాజీనామా బాట పట్టనున్నట్టు చెబుతున్నారు. ఆ ఇద్దరితో పాటు మరో 15 మంది శాసనసభ్యులు కూడా అదే రోజు రాజీనామాలు సమర్పిస్తారని సమాచారం. ఈ పరిణామాలతో ఊరట పొందుతున్న యడ్యూరప్ప శిబిరం.. ఈ సంఖ్య 25కు పెరిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదని చెబుతోంది.
తామంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల పార్టీ హైకమాండ్‌కు సదానంద గౌడ లేఖ రాయడం మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. ఒకవేళ మాపై విశ్వాసం లేకపోతే కేబినెట్‌నుంచి తొలగించాలని వారు సవాల్ చేశారు. తమని విశ్వసించని సిఎం కేబినెట్‌లో కొనసాగేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఉమేశ్ కత్తి తేల్చి చెప్పారు. ఆయనతో పాటు మంత్రులు శోభా కరంద్లాజే, సీఎం. ఉదాసి, రేణుకాచార్య, మురుగేశ్ నిరాణి, సోమణ్ణ, బొమ్మై రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
కాగా, వారి రాజీనామా లేఖలను యడ్యూరప్ప.. ముఖ్యమంత్రికి పంపుతారా..? లేక తిరస్కరిస్తారా..? అనే అంశం ఆసక్తిగొలుపుతోంది. ఇదిలా ఉండగా, అవసరమైతే రాజీనామా లేఖను అందిస్తానని హోంమంత్రి ఆర్ అశోక్ కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రుల రాజీనామా లేఖల గురించి తనకు తెలియదని సీఎం సదానందగౌడ చెప్పారు. అధిష్ఠానానికి తాను రాసిన లేఖను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
మరోవైపు రాజకీయ పరిణామాలు ఉత్సాహం కలిగిస్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు మాత్రం యడ్యూరప్ప శిబిరాన్ని కుంగదీస్తోంది. సిబిఐ దర్యాప్తునకు సంబంధించి ఏం చేయాలో పాలుపోక యడ్యూరప్ప నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. తనకు సన్నిహితులైన మంత్రులు, శాసనసభ్యులతో శనివారం తన నివాసంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని ఈ భేటీలో యడ్యూరప్పకు ఆయన సన్నిహితులు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications