గోవాలో సూరి, భాను కిరణ్ గొడవ: సర్ది చెప్పిన వర్మ

గోవాలోనే భానుకు, మద్దెలచెర్వు సూరికి మధ్య ఘర్షణ చెలరేగినట్లు మధుమోహన్ చెప్పినట్లు సమాచారం. భాను తలకు సూరి తుపాకి గురిపెట్టి బెదిరించినట్లు అతను సిఐడికి చెప్పినట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య గొడవను రామ్ గోపాల్ వర్మ పరిష్కరించాడని కూడా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మను ఈ విషయంలో సిఐడి అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోను, హీరోయిన్లను విచారించేందుకు సిఐడి అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భాను కిరణ్, సూరి, వర్మలతో పాటు ఇద్దరు హీరోయిన్లు, ఓ ప్రముఖ హీరో గోవాలోని మారియట్ హోటల్లో బస చేసినట్లు మధుమోహన్ సిఐడి అధికారుల వద్ద చెప్పినట్లు సమాచారం. మారియట్ హోటల్ నుంచి సిఐడి అధికారులు సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే వర్మను, ఇతరులను విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
సూరి హత్య కేసులో సిఐడి అధికారులు భాను కిరణ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సూరి హత్య కేసుతో పాటు భాను కిరణ్‌పై పలు ఇతర కేసులున్నాయి. ఈ కేసులపై ఆయా పరిధిల్లోని పోలీసులు కూడా విచారణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆస్తుల విషయంలోనే సూరికి, భాను కిరణ్‌కు మధ్య గొడవలు చెలరేగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాకు సూరి సహకరించినట్లు చెబుతారు. రక్త చరిత్ర సినిమాను తీయడానికి వర్మను అనంతపురం జిల్లాకు తీసుకుని వెళ్లినట్లు చెబుతారు. భాను కిరణ్‌తో సంబంధాలపై ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే వివాదంలో చిక్కుకున్నారు. నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌లతో భాను కిరణ్‌కు సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications