నోటిఫికేషన్ రిలీజ్: జగన్ అరెస్ట్‌పై కాంగ్రెస్ నేతల లెక్కలు

జూన్ 12వ తేదిన ఉప ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది. అదే నెల 15వ తేదిన ఓట్ల లెక్కింపు జరిపి, అదే రోజు ఫలితాలను చెబుతారు. కాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన వెంటనే రామచంద్రపురంలో తొలి నేమినేషన్ వేశారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు తొలి నామినేషన్ వేశారు. మంత్రులు తోట నర్సింహ, విశ్వరూప్‌లు హాజరయ్యారు.
కాగా ఓ వైపు ఉప ఎన్నికల నగారా మోగగా, కాంగ్రెసు పార్టీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై విస్తృత చర్చ జరుగుతోందట. జగన్‌ను అరెస్టు చేస్తే ఉప ఎన్నికలలో లబ్ధి పొందుతామా లేక అరెస్టు చేయకుంటేనా అని నేతలు తెగ చర్చిస్తున్నారట. అరెస్టు చేస్తేనే మంచి ఫలితాలని కొందరు అభిప్రాయపడుతుండగా, అలా చేస్తే సానుభూతి పెరిగి జగన్ అభ్యర్థులకు మరింత ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారట.
జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత దాదాపు పది శాతం వరకు ఓటర్లు ఆయనకు దూరమయ్యారని సర్వేలలో తేలుతోందని కొందరు నేతలు చెబుతున్నారట. ఈ కోణంలో చూస్తే సాధ్యమైనంత త్వరగా ఆయనను అరెస్టు చేస్తేనే కాంగ్రెసు విజయావకాశాలు మెరుగు పడతాయని చెబుతున్నారట. అరెస్టు చేస్తే ప్రజలలో ఆయన అవినీతి మరింత తెలిసిపోయి ఓటర్లు దూరమవుతారని చెబుతున్నారట.
ఇటీవల జరిగిన పరిణామాలు ప్రజలలో తదనంతర అభిప్రాయాలను కాంగ్రెసు నేతలు సేకరిస్తున్నారట. సిబిఐ విచారణకు ముందు జగన్‌కు ప్రజలు ఎలా మద్దతు పలికారు, విచారణ ప్రారంభమయ్యాక ఎంత మంది వెనక్కి వెళ్లారని లెక్కలు వేసుకుంటున్నారట. ఇటీవల సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాల స్తంభన, సాక్షికి ప్రకటనల రద్దు, జగన్‌కు 28న హాజరు కావాలని నోటీసులు.. ఇలా వరుస సంఘటనలపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారని, జగన్‌కు సానుభూతి పెరుగుతోందా, తగ్గుతోందా అనే కోణంలో దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని జగన్‌ను ఈ నెల 28న అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయానికి వస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications