జగన్ హీరో కాదు, విలనిజం బయటకొస్తుంది: చిరంజీవి

త్వరలోనే జగన్‌కు కటకటాలు తప్పవని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలో చిరంజీవి పర్యటించారు. కాంగ్రెసు పార్టీ జగన్‌కు, ఆయన కుటుంబానికి ఏమీ అన్యాయం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అని, వైయస్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని, పార్లమెంటుకూ పంపిందని, పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెసు గౌరవించిందన్నారు.
అందుకే వైయస్ కాంగ్రెసు పార్టీకి విధేయంగా ఉండటంతో పాటు సోనియాను దేవతలా కీర్తించారని, ఆయన కుమారుడు జగన్ మాత్రం సోనియా గాంధీతో పాటు కాంగ్రెసుపై తన మీడియా ద్వారా దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆగిపోయాయంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని, రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆగిపోలేదని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ హఠాన్మరణంతో ఆ కుటుంబం కోలుకోవడానికి అయిదేళ్లు పట్టిందని, కానీ తన తండ్రి వైయస్ చనిపోయిన అయిదు నిమిషాలకే జగన్ సిఎం కుర్చీ కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారని ఆరోపించారు. ఇది చూసి ఎలాంటి కొడుకుని కన్నానని వైయస్ ఆత్మ క్షోభించి ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాడన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇంటిలో రెండు మూడు వందల పడక గదులు కట్టుకున్న వైయస్ జగన్ ప్రజలకు ఎలా సేవ చేస్తాడని ఆయన అడిగారు. వైయస్ జగన్ పేదల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను విమర్శిస్తున్నారు గానీ తాను తప్పు చేయలేదని జగన్ ఎక్కడా చెప్పడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, ఆయన ఎంత గింజుకున్నా ప్రజాదరణ పొందలేరని అన్నారు. ఆయనకు ఇక అధికారం కలేనని, కాంగ్రెసు పార్టీలోనే రాజకీయంగా ఎదిగిన బాబు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి తన మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications