ప్రతిపాడు: జగన్ పార్టీ సుచరిత గట్టెక్కుతారా?

కాంగ్రెసు విప్ ధిక్కరించి తెలుగుదేశం పార్టీ శానససభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. సుచరిత ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రత్తిపాడులో సుచరితను ఓడించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రమే కాకుండా ఇతర కాంగ్రెసు నాయకులు కూడా ప్రత్తిపాడులో కాంగ్రెసు అభ్యర్థి కోసం ప్రచారం సాగించారు, సాగిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పర్యటించి, పార్టీ స్థానిక నాయకులను పార్టీ అభ్యర్థి కందుకూరి వీరయ్యకు మద్దతుగా ఒకతాటి మీదికి తేవడానికి ప్రయత్నించారు. మరోవైపు, ఈ ప్రాంతానికి చెందిన మాకినేని పెద్ద రత్తయ్య మొదట్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి, అక్కడ సరిపడక తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆయన వీరయ్య కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మాకినేని పెదరత్తయ్యతో కొంత మంది పార్టీ నాయకులకు పడడం లేదని అంటున్నారు. ఇది సుచరితకు అనుకూలంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
పొన్నూరు శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి స్థానిక నాయకులను వెంటపెట్టుకుని చంద్రబాబును కలిశారు. వీరయ్యకు టికెట్ ఇవ్వకూడదని వారు సూచించారు. కానీ చంద్రబాబు వారి మాట వినకుండా వీరయ్యనే తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాన్ని ఆసరాగా తీసుకుని సుచరిత తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గంలోని ఓ గ్రూప్ సుచరితను బలపరుస్తున్నట్లు స్థానికంగా వస్తున్న సమాచారం తెలియజేస్తోంది.
కాంగ్రెసు అభ్యర్థి సుధాకర్ బాబు కోసం కాంగ్రెసు నాయకులు పెద్ద యెత్తున ప్రతిపాడులో మకాం వేశారు. రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆయన విజయం కోసం కృషి చేస్తున్నారు. దీంతో కాపు ఓట్లు సుధాకర్ బాబుకు వస్తాయని భావిస్తున్నారు. ప్రతిపాడు విషయంలో కన్నా లక్ష్మినారాయణతో పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తొలుత విభేదించారు. అయితే, జిల్లాకు చెందిన కాంగ్రెసు అగ్ర నాయకులంతా ఒక తాటి మీదికి వచ్చి సుధాకర్ బాబు కోసం పనిచేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నియోజకవర్గానికి రాష్ట్రంలోని పలువురు పార్లమెంటు సభ్యులను రప్పించారు.
ఏమైనా, ప్రతిపాడులో ముక్కోణపు పోటీ ఆసక్తికరంగా ఉంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. సుచిరతకు విజయం నల్లేరు బండి నడక కాదని అంటున్నారు. అయితే, వంగవీటి రాధాకృష్ణ వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు చీలి, తనకు లాభం చేకూరుతుందని సుచరిత భావిస్తున్నారు.
ఏయే సామాజిక వర్గం ఓట్లు ఎన్ని (దాదాపుగా)?
కమ్మ 53,000
కాపు 42,000
మాల 34,000
మాదిగ 17,000
రెడ్డి 18,000
యాదవులు 18,000
ముస్లింలు 12,000
ఇతరులు 18,000
మొత్తం 2,07,000












Click it and Unblock the Notifications