వైయస్ జగన్ అరెస్టు పుకార్లు: భారీ భద్రతా ఏర్పాట్లు

దిల్‌కుషా అతిథి గృహం వద్ద పోలీసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలాగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెంచారు. ఈ సంకేతాలు జగన్ అరెస్టుకి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సాయంత్రమే అరెస్టు జరగవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాంపల్లి కోర్టులో ఎల్లుండి ఈ నెల 28వ తేదీన జగన్ హాజరు కానున్న నేపథ్యంలోనూ ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉండి ఉండవచ్చని కూడా అంటున్నారు.
అదే సమయంలో హైదరాబాదులో విధ్వంసానికి జగన్ అనుచర గణం చేసిన కుట్ర భగ్నం కావడంతో భద్రత పెంచి ఉండవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. జగన్ అరెస్టుపై తమకు సమాచారమేదీ తమకు లేదని పోలీసులు చెబుతున్నారు. రెండో రోజు విచారణలో జగన్‌పై సీబీఐ ప్రశ్నల వాడి పెంచినట్లు కనిపిస్తోంది. శుక్రవారం సుతిమెత్తగా సమాచారం రాబట్టిన సిబిఐ అధికారులు, నేడు సూటిగా ప్రశ్నలు సంధిస్తుండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకట రమణలతో ముఖాముఖి కూడా ఏర్పాటు చేసి జగన్ సంస్థల్లో పెట్టుబడులపై తుది నిర్థరణకు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, శనివారం సాయంత్రం నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను కస్టడీ గడువు ముగిసిన తర్వాత జైలుకు తరలించారు. ఆ తర్వాత కూడా వైయస్ జగన్ విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications