వైయస్ విజయమ్మకు ఓట్లు రాలుతాయా?

ఇప్పటి వరకు ఆమె పులివెందులలో తప్ప ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. పులివెందులలో కూడా ఆమె ఇంటింటి ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే, అప్పుడప్పుడు ఆమె మాట్లాడారు. తమ కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాస్తా ఉద్వేగపూరితంగానే అయినా హేతబద్దంగా మాట్లాడడానికి ఆమె ప్రయత్నించారు. కాంగ్రెసుపై దాడి ఎక్కు పెట్టారు.
వైయస్ జగన్ అరెస్టు వల్ల ఉప ఎన్నికల ప్రచారంలో తల్లి సెంటిమెంటు పండుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైయస్ జగన్ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ప్రచారం సాగించారు. కానీ కీలకమైన దశలో ఆయన ప్రచారానికి దూరం కావాల్సి వచ్చింది. ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 12వ తేదీన జరుగుతుండగా, వైయస్ జగన్‌కు కోర్టు జూన్ 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రచారానికి వెళ్లడమనేది సాధ్యమయ్యే పని కాదనేది అప్పుడే తేలిపోయింది.
కాగా, రాజకీయంగా వైయస్ విజయమ్మను లక్ష్యం చేసుకుని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాయి. ఉప ఎన్నికల ప్రచార రథసారథిగా మారుతుండడంతో ఆ పార్టీలకు ఆ అవసరం ఏర్పడింది. వైయస్ విజయమ్మకు వ్యతిరేకంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మహిళా నేతలను రంగంలోకి దింపుతున్నాయి. వారంతా రాజకీయాల్లో కాకలు తీరినవారే. విజయమ్మకు ఆ రాజకీయానుభవం లేదు.
అయితే, వైయస్ విజయమ్మకు ఉన్న ప్లస్ పాయింట్ ఒక్కటే. భర్తను పోగొట్టుకోవడం, కుమారుడు జైలు పాలు కావడం అనేది ఆమె పట్ల ప్రజలు సానుభూతి చూపించడానికి పనికి వస్తాయి. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసుకు చేసిన సేవలకు తన కుమారుడిని జైలు పాలు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై జరిగిన విచారణపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కనీసం తొమ్మిది పది రోజులు ప్రచారం చేయాల్సి వస్తుంది. ఒక్కటి రెండు రోజుల్లో ఆమె సత్తా, ఆమెకు లభించే ఆదరణ తెలిసి పోతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications