మూడో చార్జిషీట్: జగన్‌కు మరో పిటి వారంట్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తిరిగి మూడో చార్జిషీట్‌ను మంగళవారం కోర్టులో దాఖలు చేసింది. ఈ నెల 7వ తేదీన సిబిఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించింది. దాంట్లో తప్పులున్నాయని, దర్యాప్తు అధికారి సంతకం కూడా లేదని అంటూ ఆ చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో మళ్లీ సిబిఐ మంగళవారం తప్పులు సరిదిద్ది మూడో చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ఈ చార్జిషీట్‌లో సిబిఐ ఆరుగురు నిందితులను చేర్చించింది. తొలి నిందితుడిగా వైయస్ జగన్‌ను, రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డిని, మూడో ముద్దాయిగా వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌ను చేర్చింది. నాలుగో నిందితుడిగా రాంకీ సంస్థ చైర్మన్ అయోధ్య రామిరెడ్డిని, ఐదో నిందితుడిగా ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని, ఆరో ముద్దాయిగా రాంకీ సంస్థను చేర్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం సమీపంలో రాంకీ భూములను పొందిందని, అందుకు ప్రతిఫలంగా వైయస్ జగన్ కంపెనీలో పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిందని సిబిఐ ఆరోపించింది.
కాగా, తనపై నమోదు చేసిన కేసుపై వైయస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు అక్రమమంటూ ఆయన ఈ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అదే విధంగా హైకోర్టులో ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు కొట్టేయడంతో ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను, సిబిఐ కస్టడీకి కోరిన పిటిషన్‌ను రెండింటినీ గురువారానికి వాయిదా వేసింది. తనకు జైలులో అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. తనకు జైలులో అదనపు భద్రత కల్పించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications