వైయస్ భార్యగా కాదు: విజయమ్మపై కాంగ్రెసు వ్యూహం

కాంగ్రెసు పార్టీ పైనా, తమ పార్టీ నేతల పైనా ఆమె చేసే విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తదితరులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైయస్ జగన్ పార్టీని వీడినప్పటికీ.. జగన్ బయట ఉన్నంత కాలం విజయమ్మ దాదాపు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు రెండు మూడు మినహా లేవు.
అయితే జగన్ జైలుకు వెళ్లాక పార్టీ బాధ్యత పూర్తిగా ఆమె పైనే పడింది. దీంతో ఆమె కాంగ్రెసు పార్టీ పైన ఎదురు దాడి మరింత పెంచనుంది. జగన్‌ను అరెస్టు చేసిన రోజు విజయమ్మ మాట్లాడుతూ... తన తనయుడి అరెస్టులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుట్ర ఉందని, తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అంతకుముందు రెండుమూడుసార్లు విజయమ్మ విమర్శలు చేసినప్పటికీ కాంగ్రెసు నాయకులు పెద్దగా స్పందించలేదు.
అయితే జగన్ అరెస్టు, వైయస్ మృతిపై ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం వంటి వాటితో కాంగ్రెసు ఆత్మరక్షణలో పడింది. దీంతో తమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి భార్యగా ఆమెను గౌరవిస్తూ ఇన్నాళ్లూ విమర్శలపై స్పందించని నేతలు ఇప్పుడు ఆమెపై ఎదురు దాడి ప్రారంభించారు. తమ పార్టీ నేత వైయస్ సతీమణిగా ఆమెను గౌరవిస్తామని, అయితే విపక్ష నేతగా ఆమె విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతామని కాంగ్రెసు నేతలు చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె సోనియా గాంధీ పైన గానీ, కాంగ్రెసు పైన గానీ విమర్శలు గుప్పిస్తే అందుకు ధీటుగా స్పందించాలని వారు భావిస్తున్నారు. మహిళా నేతలు కూడా వైయస్ విజయమ్మకు కౌంటర్ వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బుధవారం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైయస్ విజయమ్మ మారిపోయారని చెప్పారు.












Click it and Unblock the Notifications