టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత అరెస్ట్: పోలీసులపై ఫైర్

అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెబుతూ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి ఇవ్వలేదు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపడతానని ఆమె ప్రకటించారు. దీంతో పోలీసులు అనంతలో 144వ సెక్షన్ విధించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. దీక్ష కోసం ఆమె పార్టీ నేతలతో మాట్లాడారు. అయితే ఆమె ఎట్టి పరిస్థితుల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమవుతానని సునీత ప్రకటించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద అనుమతి నిరాకరించడంతో టిడిపి కార్యాలయం వద్ద రోడ్డుపై ఆమె బైఠాయించారు. దీంతో పోలీసులు అమెను అరెస్టు చేశారు. ఆమెతో సహా పలువురు నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. సెక్షన్ 151 కింద ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను పోలీసులు అరెస్టు చేయడంపై సునీత తీవ్రంగా మండిపడ్డారు. తాము మౌనంగా దీక్ష చేపడతామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని టిడిపి తప్పు పడుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
తన పసుపు కుంకుమలు పోగొట్టిన దుర్మార్గుడని తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ అరెస్టుపై అయిన సందర్భంగా ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. తన భర్త హత్య కేసును సీబీఐ పునర్విచారణ చేయాలని కోరుతూ తాను మంగళవారం దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిటాల రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన హత్యకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ కలిసి కుట్ర పన్నుతున్నారని తెలిపిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చెప్పినట్లుగానే పరిటాల రవిని పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను అసెంబ్లీలో వైయస్ ఎదుట ఇదే విషయాన్ని ప్రస్తావించానని, ఈ రోజు కూడా అదే చెబుతున్నానని ఆమె అన్నారు. పరిటాల రవి హత్యకు జగన్ మూలకారకుడని సునీత ఆరోపించారు. సూట్‌కేస్ బాంబు కేసులో కూడా జగనే తొలి ముద్దాయి అని చెప్పారు. అధికారబలంతో ఆ రోజు కేసు నుంచి తప్పించుకున్నారని, రవి హత్య కేసుతో జగన్‌కు సంబంధం లేదని సిబిఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని వైయస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ చెప్పుకుంటూ వచ్చారన్నారు.
ఇది విన్న విజయలక్ష్మి ఆనాడు సిబిఐని కొనియాడారన్నారు. నేడు అవినీతి కేసులో జగన్ జైలుకు వెళితే తన కొడుక్కి ఏమీ తెలియదని, అమాయకుడని మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. సానుభూతి కోసమే విజయమ్మ ఈ డ్రామా ఆడుతున్నారని సునీత అన్నారు. ఏ కన్నతల్లి అయినా బయటి నుంచి తన కొడుకు ఏదైనా తీసుకొస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతుందని, అయితే జగన్‌కు లక్షల కోట్లు వస్తున్నా అనేక కంపెనీలు స్థాపిస్తున్నా విజయలక్ష్మి మాత్రం ఇవన్నీ ఎలా వస్తున్నాయో ప్రశ్నించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు.
తన భర్త హత్య కేసులో ఆరోజే సీబీఐ సమగ్ర విచారణ జరిపించి ఉంటే జగన్‌కు తప్పకుండా శిక్ష పడేదని సునీత అభిప్రాయపడ్డారు. ఆ రోజు అధికారబలంతో తప్పించుకున్నా, ఈరోజు దేవుడున్నాడు కాబట్టే జగన్ జైలు పాలయ్యారన్నారు. తన భర్త హత్యకు దంతలూరి కృష్ణ ద్వారా తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపారనేందుకు తమ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు.
ఇప్పుడు తాము వాటిని చూపినా నమ్మే పరిస్థితి లేదని, అందుకే రవి హత్య కేసును సీబీఐ పునర్విచారణ చేయాలని కోరుతూ అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మంగళవారం ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరుతున్నామన్నారు. వారు అనుమతిస్తే మంగళవారం దీక్ష చేస్తానని సునీత తెలిపారు.












Click it and Unblock the Notifications