జగన్ జిల్లాలో అమర్నాథ్ రెడ్డి తిరిగి పాగా వేస్తారా?

వైయస్ జగన్ సొంత జిల్లా కావడంతో అది తనకు అనుకూలిస్తుందని అమర్నాథ్ రెడ్డి భావిస్తున్నారు. వైయస్ జగన్ జైలుకు వెళ్లిన ప్రభావం కూడా కనిపిస్తుందని అంటున్నారు. వైయస్ విజయమ్మ ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. దానివల్ల సానుభూతి ఓట్లు తనకు కలిసి వస్తాయని అనుకుంటున్నారు. ఏమైనా పోటీ మాత్రం హోరాహోరీగానే ఉంటుంది.
2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేడా ఇప్పటినుంచే సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వైయస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డి నియోజకవర్గంలోని మైనార్టీలు, తన సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తల అభిమానం చూరగొన్నారు. దివంగత నేత వైయస్‌పై ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు తనకే అనుకూలిస్తాయని ఆయన గట్టి ధీమాతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పసుపులేటి బ్రహ్మయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009లో పార్టీ టికెట్ లభించలేదు. దీంతో ఆయన పార్టీకి దూరమైన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. తిరిగి తన సొంత పార్టీ తెలుగుదేశంలోకి వచ్చారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మండల స్థాయి నేతలు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళారు. దీంతో ఉన్న వారితో ప్రచారం చేస్తూనే వలస వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. వీరబల్లి, సుండుపల్లె మండలాలు చేరడంతో ఆ మండలాల కార్యకర్తలపై దృష్టి సారించారు. పసుపులేటి ట్రస్ట్ ద్వారా బ్రహ్మయ్య నియోజకవర్గ వ్యాప్తంగా సేవ చేస్తుండడంతో కొంత మేరకు ఆయన ద్వారా లబ్ది పొందిన ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంది. అలాగే తన సామాజిక వర్గానికి చెందిన బలిజలు, బడుగు, బలహీనవర్గాల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలు వెళ్లలేదనే ధీమాతో బ్రహ్మయ్య ఉన్నారు.
బిజెపి తరఫున రాష్ట్ర మాజీమంత్రి, స్వర్గీయ బండారు రత్నసభాపతి కుమారుడు బండారు నటరాజు పోటీ చేస్తున్నారు. రాజంపేటలో బిజెపికి పెద్దగా పట్టులేకపోయినప్పటికీ రత్నసభాపతి కుటుంబానికి ఉన్న ఘన చరిత్రను ఓట్ల రూపంలో మార్చుకునేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు వ్యూహం రూపొందించి ముందుకు సాగుతున్నారు. బిజెపి అభ్యర్థి బండారు నటరాజ్ బ్రహ్మయ్య సామాజికవర్గానికి చెందిన వాడైనందున ఆ వర్గం నుంచి సైతం ఆయనకు ఆదరణ లభిస్తోంది.
ఆయన తండ్రి బండారు రత్నసభాపతి 1967 నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి పదవిలో కూడా కొనసాగారు. తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,81,431 మంది ఓటర్లు ఉన్నారు. రాజంపేట మండలంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇంచుమించు సరిసమానంగా ఓట్లు రావచ్చు.












Click it and Unblock the Notifications