వీటికి సమాధానమివ్వాలి:విజయమ్మకు టిడిపి ప్రశ్నలు

పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలను ఆమెకు సంధించారు. దానిని మీడియాకు విడుదల చేశారు. జగన్ జైలుకెళ్లడం వల్ల నేతలు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్‌లోకి జారుకుంటారనే భయంతోనే విజయలక్ష్మి, ఆమె కుమార్తె షర్మిలను రోడ్డెక్కించడం నిజం కాదా అని, రోజూ ఉదయం ఆరింటికే సిఎం క్యాంపు కార్యాలయంలో మీ భర్త, కొడుకు.. కోనేరు ప్రసాద్ లాంటి వారితో బేరసారాలు సాగిస్తున్నప్పుడు ఎందుకు హెచ్చరించలేదని ఆమె ప్రశ్నించారు.
ఎమ్మార్ విల్లాలు పది రెట్లకు అమ్మి కోనేరు ప్రసాద్ ఇచ్చిన కోట్లాది రూపాయలను సునీల్ రెడ్డి మీ ఇంటి ఖర్చులకు, విలాసాలకు ఖర్చు పెడుతున్నప్పడు అవి ఎక్కడివని ఏ రోజైనా అడిగారా అన్నారు. సండూర్ పవర్‌లోకి హవాలా డబ్బు రూ.వెయ్యి కోట్లు తరలించడం నేరమని, దానివల్ల జైలుకు పోవాల్సి వస్తుందని మీ భర్తను, కొడుకును ఎందుకు హెచ్చరించలేదన్నారు. పులివెందుల కృష్ణ, భాను కిరణ్, మధుమోహన్ రెడ్డి వంటి నేరస్తులతో స్నేహం చేసినప్పుడు మీ కొడుక్కి బుద్ధులు ఎందుకు చెప్పలేదన్నారు.
పరిటాల రవి సహా 200 మంది టిడిపి కార్యకర్తలను వైయస్ ప్రోత్సాహంతో జగన్ గ్యాంగ్ హత్య చేసినప్పుడు వారికీ భార్య, పిల్లలు ఉంటారని తెలియదా అని, మీ బిడ్డ కారణంగా జైలు పాలైన బిపి ఆచార్య, రాజ గోపాల్‌ల ముసలి తల్లులను మీరు కనీసం ఓదార్చారా అని ప్రశ్నించారు.
రాజన్న కూతురునని... జగన్ చెల్లెలినని షర్మిల ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారని, అనిల్ భార్యనని మాత్రం చెప్పడం లేదని, అనిల్ పేరు చెబితే బయ్యారంలో కట్నంగా పుచ్చుకొన్న లక్షన్నర ఎకరాల గనుల సంగతి జనానికి గుర్తుకు వస్తుందని భయపడుతున్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర కార్యదర్శి శోభారాణి ఆరోపించారు. జగన్‌ను గెలిపిస్తే రాజన్న రాజ్యం తెస్తామంటున్న షర్మిల.. ఆయన రాజ్యంలో ఎవరు బాగుపడ్డారో మాత్రం చెప్పడం లేదన్నారు. జగన్, గాలి వంటి వారికే లబ్ధి చేకూరుతుందన్నారు.












Click it and Unblock the Notifications