జగన్ పార్టీకి ఓటేస్తూ దొరికిన ఇద్దరు అధికారులు అరెస్ట్

Ballot Box
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తూ ఇద్దరు అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో ఉప ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఇద్దరు ఎన్నికల అధికారులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని చెబుతూ, ఓ అధికారి స్వయంగా జగన్ పార్టీకి ఓటేస్తూ ఈసికి చిక్కారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా గుర్తించిన ఎన్నికల సంఘం వారిపై వెంటనే వేటు వేసింది. వారిని అరెస్టు చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఒంగోలులోని పివిఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వేటర్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్ శేషగిరి, వి.శేషగిరి అనే ఇద్దరు ఎన్నికల అధికారులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఈసి గుర్తించింది. ఓటు వేయడానికి వచ్చిన వారిని వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయమని సూచిస్తున్నట్లుగా వెబ్ కాస్టింగులో దొరికిపోయారు. దీంతో వారిపై వేటు పడటంతో పాటు అరెస్టయ్యారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా ఆయా నియోజకవర్గాలలో స్వల్ప ఉద్రిక్తలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాయచోటి నియోజకవర్గంలోని పెమ్మాడపల్లిలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ఏజెంట్లు గొడవకు దిగారు. దీంతో అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలులోని కందూకురులో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు మధ్య ఘర్షణ జరగటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. రైల్వేకోడూరు, మాచర్ల, అనంతపురం, రాజంపేట, రాయచోటిలలో కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు అదుపులోకి తీసుకు వచ్చారు.

రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని, సంబేపల్లిలో జగన్ పార్టీ నేత సంబారెడ్డిని తదితరులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను అనవసరంగా అరెస్టు చేస్తున్నారంటూ అమర్నాథ్ రెడ్డి నందనూరులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతలో గుర్నాథ్ రెడ్డిపై టిడిపి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

మాచర్లలోని అడిగొప్పులలో బూత్‌లో ప్రచారం చేస్తున్నారంటూ జగన్ పార్టీ అభ్యర్థి పైన టిడిపి నేతలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజానగరంలో ఇనుపరాడ్లతో ఓ పత్రిక విలేకరి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల పిలుపుతో బుట్టాయపల్లి గ్రామస్తులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ హైదరాబాదులో అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ఫస్ట్ హవర్‌లో మందకోడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకుందన్నారు. నరసన్నపేటలో 28 శాతం, పాయకరావుపేటలో 23, రామచంద్రాపురంలో 25, పోలవరంలో 28, ప్రత్తిపాడులో 24, మాచర్లలో 22, ఒంగోలులో 21, ఉదయగిరిలో 33, రాజంపేటలో 29, రాయచోటిలో 26, ఎమ్మిగనూరులో 30, రాయదుర్గంలో 24, అనంతపురంలో 21, తిరుపతిలో 27, పరకాలలో 26, రైల్వేకోడూరులో 27 శాతం ఓటింగ్ జరిగిందని చెప్పారు. నెల్లూరు పార్లమెంటు స్థానంలో 28 శాతం ఓటింగ్ జరిగిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+