అరెస్టుకు ప్రయత్నం, ఐపియస్ అధికారి ఉమేష్ పరారీ

Umesh Kumar
హైదరాబాద్: అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఐపియస్ అధికారి ఉమేష్ కుమార్ పలాయం చిత్తగించారు. డిజిపి స్థాయి ఐపియస్ అధికారి ఇలా పలాయం చిత్తగించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. డిజిపి కాకుండా దినేష్ రెడ్డిని అడ్డుకోవాలనే ప్రయత్నంతో ఆయన తన అరెస్టు దాకా వ్యవహారాన్ని తెచ్చుకున్నారు. కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఉమేష్‌కుమార్‌కు నాంపల్లి కోర్టు గురువారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.

ఈ నెల 21వతేదీలోపు వారెంటును అమలుచేయాలని కోర్టు ఆదేశించింది. డిజిపి స్థాయి ఐపిఎస్ అధికారికి నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. వారెంటు జారీ కావడంతో సీఐడీ అధికారులు గురువారం సాయంత్రం హైదరాబాద్ గాయత్రి హిల్స్ సమీపంలోని ఆయన అధికార నివాసానికి వెళ్లారు. అయితే, సీఐడీ బృందం త న ఇంటికి బయల్దేరిందన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న ఉమేష్‌కుమార్ తన గన్‌మెన్‌ను ఇంటి వద్దే వదిలి అధికారిక కారులో కొంత దూరం వెళ్లారు.

తర్వాత కారు దిగిపోయి వేరే ఆటోలో ఎక్కడికో వెళ్లిపోయారు. కాసేపటికి ఉమేష్ ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారులు గన్‌మెన్, డ్రైవర్ ద్వారా జరిగిన విషయం తెలుసుకుని మొత్తం పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించి, ఉమేష్ ఇంట్లో సోదాలు చేశారు. కారు డ్రైవర్, గన్‌మెన్ వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే, కారు డ్రైవర్ పొంతనలేకుండా మాట్లాడాడు.

సాయంత్రం నాలుగున్నరకే ఉమేష్‌కుమార్ ఇంటి నుంచి బయల్దేరారని, ఇంటి నుంచి కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత కారు దిగి వెళ్లిపోయారని డ్రైవర్ సీఐడీ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఉమేష్‌కుమార్ ఎక్కడికి వెళ్లారన్న విషయం అతడికి తెలిసే ఉండొచ్చని భావిస్తున్నారు. ఉమేష్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ అయిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు తెలియచేసినట్లు సమాచారం. కాగా, శుక్రవారం నేరుగా కోర్టుకు వెళ్లి లొంగిపోవడం కానీ, లేదా హైకోర్టులో పిటిషన్ వేయడం కానీ ఉమేశ్ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.

దినేష్‌రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ. ఖాన్ పేరిట కేంద్ర హోంశాఖకు ఒక లేఖ అందింది. అనుమానం వచ్చిన అధికారులు ఆ లేఖను పరిపాలన శాఖకు పంపించి విచారణ జరిపించాలని సూచించారు. శాఖ అధికారులు ఖాన్‌ను లేఖ విషయమై ప్రశ్నించగా తాను రాయలేదని చెప్పారు. ఈ లేఖపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ అధికారులను ఆదేశించింది. ఉమేష్‌కుమార్ ప్రొద్బలంతో ఆ లేఖను మాజీ జర్నలిస్టు సునీల్‌రెడ్డి తయారు చేయించాడని విచారణలో వెల్లడైంది.

సునీల్‌రెడ్డిని అరెస్టు చేయగా, అప్రూవర్‌గా మారాడు. తర్వాత నాంపల్లి కోర్టులో ఫోర్జరీ కేసు విచారణ ప్రారంభమైంది. విచారణకు ఉమేష్‌కుమార్ హాజరుకాకుండా తనకు వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చిందని తప్పుడు వివరాలతో కోర్టును నమ్మించడానికి ప్రయత్నించారు. దీంతో, గత వారం సిఐడి అధికారులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలుచేశారు. కస్టడీలో తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో గురువారం ఉమేష్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+