దాడులు: నిన్న లిక్కర్ సిండికేట్.. నేడు ట్రావెల్ ఏజెన్సీస్

ట్రావెల్ ఏజెన్సీల నుండి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ఇరవై బృందాలుగా విడిపోయి ఆర్టీఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాదులోనే పాండురంగా రావు ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలుగా విడిపోయి కూకట్‌పల్లి, అమీర్‌పేట, లక్డీకాపూల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో సోదాలు చేస్తున్నారు.
ట్రావెల్ ఏజెన్సీల నుండి బస్సుల వివరాలు, డ్రైవర్ అనుభవం, ఆయన చిరునామా, ఫోన్ నెంబర్లు తదితరాలు అడిగి తీసుకుంటున్నారు. అన్ని నగరాలలో ట్రావెల్ సంస్థలలోని గత రికార్డులను పరిశీలిస్తున్నారు. లైసెన్స్ లేని ట్రావెల్ ఏజెన్సీలను సీజ్ చేస్తున్నారు. తిరుపతిలో రెండు ట్రావెల్ ఏజెన్సీలను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. లక్డీకాపూల్‌లోని పలు ట్రావెల్ ఏజెన్సీలలో సోదాలు నిర్వహించిన అధికారులు లైసెన్స్ లేని ఆరు ఏజెన్సీలను గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఆరు ఏజెన్సీలకు లైసెన్స్ లేదని తమ దృష్టికి వచ్చిందని, వాటిపై చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ లేకుండా టిక్కెట్లు ఇచ్చే వారికి నోటీసులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలలో ప్రాథమిక సమాచారం మేరకు తొమ్మిది ట్రావెల్స్ ఏజెన్సీలకు అనుమతులు లేవని తెలుస్తోంది. కాగా ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఆర్టీఏ ఈ సోదాలు నిర్వహిస్తోంది.
రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు మరో మూడు ప్రమాదాలు జరిగాయి. తిరుపతి నుంచి విజయవాడ వెళుతున్న ఓ ప్రయివేటు బస్సు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాలోనూ ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications