విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటిపై బాలయ్య డైలాగ్: బాబు ధర్నాకు వల్లభనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలంటూ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహాధర్నాకు టిడిపి సీనియర్ నేత వల్లభనేని వంశీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పైన నిప్పులు చెరిగారు. ఫ్లై ఓవర్ నిర్మించాలని టిడిపి హయాంలోనే ప్రతిపాదనలు చేశామని ఆయన చెప్పారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చి కాంగ్రెసు కేంద్రంలో చూస్తే అవినీతిలో కూరుకుపోయి, ప్రజలపై పన్నుల భారం వేస్తుండగా, రాష్ట్రంలోని నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. ఇక స్థానిక నేతల గురించి చెప్పాలంటే లగడపాటి గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిదన్నారు. ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెసు దృష్టి సారించడం లేదని, అందుకే ఫ్లై ఓవర్ నిర్మించడం లేదన్నారు.

లగడపాటి విజయవాడలో తక్కువ మీడియాలో ఎక్కువ ఉంటారన్నారు. అతను నిత్యం తగాదాలు పెట్టుకుంటాడు కాబట్టి గతంలో అతనిని జగడపాటి అనే వారన్నారు. హడావుడి రాజగోపాల్ అనే బిరుదు కూడా ఉందన్నారు. కంచి శంకరాచార్యలా నిత్యం పంచె కట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని ప్రతి అంశాన్ని రాద్దాంతం చేస్తారన్నారు. అనవసర రాజగీయాలు ఆయనకు అలవాటే అన్నారు. లగడపాటి ఇచ్చిన పెయిడ్ ఆర్టికల్స్ చూసి ఏదో అభివృద్ధి చేస్తాడని భావించి నెల్లూరు నుండి వచ్చినప్పటికీ ప్రజలు ఆయనను గెలిపించారన్నారు.

కానీ ఆయన ఎప్పుడూ అభివృద్ధి పైన, ప్రజా సమస్యల పైన దృష్టి సారించలేదన్నారు. తమది ప్రజా సమస్యలపై పోరాటే చేసే పార్టీ అని అందుకే ఉప ఎన్నికలు అయిపోగానే బాబు ప్రజల తరఫున పోరాటం ప్రారంభించారన్నారు. బాబును అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లుగా చేయవద్దన్నారు. లగడపాటిది బాబు స్థాయి కాదని, అతనికి అంత సీన్ లేదన్నారు. తాను గానీ, జిల్లా స్థాయి నేతలు మాత్రం లగడపాటి స్థాయికి చాలన్నారు.

ఈ సందర్భంగా వంశీ హీరో బాలకృష్ణ సినిమా తరహా డైలాగ్ కొట్టారు. అభివృద్ధి, ఫ్లై ఓవర్ పై చర్చించేందుకు తాను ఏ సెంటర్‌కు రమ్మన్నా వస్తానని సవాల్ విసిరారు. సెంటర్, టైం చెబితే తాను వచ్చేందుకు సిద్ధమన్నారు. నాలుగేళ్లు చదవాల్సిన ఇంజనీరింగ్ కోర్సు ఐదేళ్లు చదివిన లగడపాటి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అదే పార్టీకి చెందిన మంత్రి పార్థసారథి బ్రిడ్జి కట్టాలని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.

తెలుగుదేశం ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు. చిలక జోస్యం, పిచ్చి సర్వేలు చేసే లగడపాటి నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో అతనిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు తన్ని తరిమి కొట్టక తప్పదన్నారు. వర్ల రామయ్య కూడా మాట్లాడుతూ... ఏ సెంటర్‌కు రమ్మన్నా, ఏ సమయానికి రమ్మన్నా సిద్ధమని లగడపాటికి సవాల్ విసిరారు.

అన్ని పార్టీలు ఫ్లైఓవర్ నిర్మాణం కావాలంటుంటే లగడపాటి ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. నిర్మాణం అడ్డుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో చాలా ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరిగాయన్నారు. ఫ్లై ఓవర్ అడ్డుకోవడంపై లగడపాటి సమాధానం చెప్పాలన్నారు. బాబు కాన్వాయ్ దారి మళ్లింపుపై పోలీసులు క్షమాపణ చెప్పాలని, భక్తులు, ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే టిడిపి ప్రయత్నమన్నారు.

English summary
Telugudesam Party senior leader Vallabhaneni Vasmi participated in party chief Nara Chandrababu naidu's maha dharna on Monday in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X