కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేకి: కెకె సంచలన వ్యాఖ్య

ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలతోనైనా తమ పార్టీ అధిష్టానం కళ్లు తెరవాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు అన్నారు. వారు సోమవారం కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలతో తెలంగాణకు సంబంధం లేదని వారన్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో తెలంగాణను ముడిపెట్టవద్దని వారన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని మందా జగన్నాథం కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ కావాలని ఆంటోనికి విన్నవించినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము యుపిఎ భాగస్వామ్య పక్షాలతో తెలంగాణపై మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే తాము ఎన్సీపి నేత, కేంద్ర మంత్రి శరద్ పవార్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. పరకాల ఉప ఎన్నిక ఫలితంతోనైనా పార్టీ అధిష్టానం కళ్లు తెరవాలని, తెలంగాణలో ఎన్నికకు మరో ఎన్నికకు కాంగ్రెసు ఓట్లు తగ్గిపోతున్న విషయాన్ని గుర్తించాలని వారన్నారు.
తాము తమ కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని, తెలంగాణకు అనుకూలంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు. ఆ తర్వాత కేశవ రావు సహా తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలిశారు. పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్ వాయలార్ రవిని కలిసినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications