రానున్నవి చీకటిరోజులేనా?: విద్యుత్తుపై సిఎం సమీక్ష

కోతలు లేకుండా చూసేందుకు సరిపడా విద్యుత్తు అందుబాటులో లేదని అధికారులు అంటున్నారు. గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలను పనిచేయించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ కొరతతో గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని రెండు గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలు పనిచేయడం లేదని అంటున్నారు. వీటికి పని కల్పించేందుకు కేంద్రాన్ని గ్యాస్ సరఫరా చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి సమాయత్తమయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోత ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ భారీ విద్యుత్ లోటు వల్ల కోతలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వానాకాలం వచ్చిన రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. తాజా లోటుతో ఈ కోతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. రాష్ట్రంలో 248 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 208 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది.
వర్షాలు లేక రిజర్వాయర్లలోకి నీరు రాకపోవడంతో జల విద్యుత్కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. జల విద్యుదుత్పత్తి 4 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుతం జెన్కో 88 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 120 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కేంద్రం నుంచి, ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. మొత్తం మీద, వర్షాలు కరుణించకపోతే రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications