తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేతలపై కేసుల ఎత్తివేత

తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్, బాల్క సుమన్‌లపై కేసులను కూడా ఇందులో భాగంగా ప్రభుత్వం ఎత్తేసింది. చట్టానికి లోబడి న్యాయసంబంధమైన చిక్కులు ఎదురు కాకుండా దశలవారీగా కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం శాసనసభలో హామీ ఇచ్చింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటూ న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఈ కేసులను ఎత్తేసింది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మరిన్ని కేసులను ఎత్తేసే అవకాశం ఉంది.
ఒక్కో విద్యార్థి నేతపై డజన్ల కొద్ది కేసులున్నాయి. పిడమర్తి రవి మీద దాదాపు 20 కేసులున్నాయి. ఇలా ఒక్కో కేసు నుంచి విద్యార్థులు బయటపడే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థులపై 1900 దాకా కేసులు నమోదయ్యాయని, ప్రభుత్వం ఎత్తేసిన కేసులు అందులో సగం కూడా లేవని పిడమర్తి రవి అన్నారు. అయితే, కేసుల ఎత్తివేత కన్నా తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యమని ఆయన అన్నారు. అయితే, కేసుల ఎత్తివేత వల్ల తమపై ఒత్తిడి తగ్గుతుందని, తెలంగాణ రాష్ట్ర సాధనకు మళ్లీ ఉద్యమం చేపడాతమని ఆయన అన్నారు.
కేసులు ఎత్తేయడం కన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ఎక్కువ సంతోషించేవాళ్లమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని తాము ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ విద్యార్థులు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని గోపాలపురం, పంజగుట్ట, తదితర పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కేసులు ఎత్తేయాలని అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో దశలవారీగా కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications