జగన్ ఆస్తుల స్తంభన: ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

గతంలో జగన్ మీడియా ఆస్తులు జప్తు చేయాలన్న సిబిఐ కోర్టులో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అందుకు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్ ఖాతాలను సిబిఐ స్తంభింప చేసింది. నాంపల్లి కోర్టు తీర్పు సాక్షి మీడియా హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ దానికి ఊరట లభించింది. సాక్షి మీడియా బ్యాంక్ అకౌంట్లను డిఫ్రీజ్ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించింది.
అయితే సాక్షి మీడియాకు కొన్ని షరతులతో కూడన ఊరటను కోర్టు ఇచ్చింది. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు హైకోర్టు పేర్కొంది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ఉన్న రూ.94 కోట్ల ఎఫ్‌డిల జోలికి వెళ్లవద్దని సాక్షికి సూచించింది. వసూళ్లు, చెల్లింపులు చెక్కుల రూపంలోనే జరగాలని పేర్కొంది. సిబిఐ దర్యాఫ్తునకు సహకరించాలని, వాళ్లు అడిగిన వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించింది.
కరెంట్ ఖాతాలలో ఉన్న రూ.9 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని, స్థిరాస్తులను ష్యూరిటీగా చూపాలని సూచించింది. ఉద్యోగుల జీతాలను కూడా అకౌంట్ పే ద్వారా చెల్లించాలని తెలిపింది. జగన్ మీడియా అకౌంట్ల నిర్వహణ, లావాదేవీల వ్యవహారాలను ప్రతి నెల 10వ తేదిన సిబిఐకి నివేదిక రూపంలో అందచేయాలని చెప్పింది. ఉద్యోగుల జీతభత్యాలు, పత్రికా ముద్రణకు మాత్రమే డబ్బులను తీసుకోవాలని, ప్రకటనల ద్వారా, సర్క్యులేషన్ ద్వారా వచ్చే డబ్బును వేతనాలు ఇచ్చేందుకు ఉపయోగించాలని సూచించింది. ఆస్తుల క్రయవిక్రయాలు జరపరాదని సాక్షికి సూచించింది. తాజాగా ఆ ఉత్తర్వులను హైకోర్టు సవరించింది.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టై జైలులో ఉన్న రాజగోపాల్, శ్రీలక్ష్మి, గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును 18వ తేదికి వాయిదా వేసింది. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ల రిమాండును కోర్టు జూలై 18వ తేది వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications