జగన్‌కు విజయమ్మ క్లీన్‌చిట్, ఏ క్షణమైనా ఎన్నికలు

తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఒక్క జగన్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయ నేతలు ఎందరి పైనో ఆరోపణలు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. సిబిఐ దర్యాఫ్తుకు ముందు కూడా జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారని, దర్యాఫ్తు ప్రారంభమయ్యాక ఆయన ఓ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని.. కానీ సిబిఐ ఉప ఎన్నికలకు ముందే ఆయనను అరెస్టు చేయడం వెనుక గూడార్థమేమిటన్నారు.
తొమ్మిది నెలలుగా సాక్ష్యులను ప్రభావితం చేయని జగన్ ఉప ఎన్నికలకు ముందే చేస్తారా అన్నారు. వైయస్ హయాంలోని 26 జివోలపై కౌంటర్ దాఖలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్‌ను క్రిమినల్స్‌ను తీసుకు వచ్చే వ్యాన్‌లో తీసుకు వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. జగన్‌కు ప్రాణహానీ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
కోర్టులను సిబిఐ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వైయస్ ప్రజల గుండెల్లో నిలవడమే కక్ష సాధింపుకు కారణమా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై నెల రోజులు దాటినా దర్యాఫ్తు ప్రారంభించని సిబిఐ జగన్ విషయంలో మాత్రం వెంటనే ప్రారంభించిందన్నారు. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ వ్యవహార శైలిపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశామన్నారు. పలువురు నేతలను కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు.
ఈనాడు రాసిందే కరెక్టా అని ఆమె ప్రశ్నించారు. ఈనాడు పెట్టుబడులు తప్పు కానప్పుడు సాక్షివి ఎలా తప్పని ఆమె ప్రశ్నించారు. రెండు నెలలుగా వైయస్ కుటుంబాన్ని మరింత ఎక్కువగా వేధిస్తున్నారన్నారు. తన భర్త వైయస్ కానీ, కొడుకు జగన్ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తాడన్నారు. కోర్టుల పైన తనకు నమ్మకముందన్నారు. అంతిమంగా ధర్మం, న్యాయమే గెలుస్తుందన్నారు.
ఉప ఎన్నికలలో పార్టీకి విజయం సాధించి పెట్టి ఇవ్వడం ద్వారా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని వారు భావిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయినప్పటికీ వారు డిపాజిట్ కోల్పోయారన్నారు. పరకాలలో కొండా సురేఖ గెలిచి ఓడిందన్నారు. అక్కడ కాంగ్రెసు, టిడిపి టిఆర్ఎస్‌కు మద్దతిచ్చి గెలిపించిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. జగన్ జైలు నుండి బయటకు వచ్చే నాటికి మనం ఇది సాధించామని అతనికి చెప్పే విధంగా ఉండాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
ఉప ఎన్నికల విజయంలో అందరి పాత్ర ఉందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్ర రైతాంగం ఇబ్బందులకు గురి కాలేదన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ఎరువుల సరఫరా సక్రమంగా లేదన్నారు. జూలై 8న వైయస్ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయ సాధన దిశలో సాధ్యమైనంత మేర పేదలకు సహాయం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications