రాష్ట్రంపై కసరత్తు: కెవిపితో రాహుల్ గాంధీ చర్చలు

రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నాయకులతో సమాలోచనలు జరిపిన రాహుల్ గాంధీ గురువారం రామచంద్రరావుతో రెండోసారి చర్చలు జరపటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు నిరాశపరచడంతో పార్టీ తీరును, ప్రభుత్వ తీరును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.
నాయకత్వ మార్పుతోపాటు అవినీతి ఆరోపణలు వచ్చిన పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదంపైనా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ వివాదంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ఆలోచిస్తోందని హోం మంత్రి పి చిదంబరం ఇటీవల ప్రకటించటం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కెవిపితో రాహుల్ తాజాగా జరిపిన సమావేశానికి ప్రాధాన్యత ఉందని అంటున్నారు.
ఇదిలావుంటే, తనతో జరిపిన చర్చల వివరాలను పత్రికలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు వెల్లడించినందుకే రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి రెండోసారి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రాహుల్ రద్దు చేసుకున్నారని అంటున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం గోవర్ధన్ రెడ్డి బుధవారం రాహుల్‌తో సమావేశం కావలసి ఉంది. అయితే, గోవర్ధన్ రెడ్డి ఎలక్ట్రానికి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై లిఖిత పూర్వక నివేదిక రాహుల్‌కు అందజేయనున్నట్టు చెప్పటంతోనే, అపాయింట్‌మెంట్ రద్దయ్యింది.
రాహుల్ గాంధీ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోనూ సమావేశం జరిపినట్టు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వైయస్సార్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం గురించి ఒవైసీతో రాహుల్ చర్చించి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications