కొలిక్కి వచ్చిన కర్నాటకం: షెట్టర్‌కు లైన్ క్లియర్

రాజీ ఫార్ములాలో భాగంగా రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించడానికి అధిష్టానం అంగీకరించింది. ఇందులో రెండు వైరి వర్గాలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. జగదీష్ షెట్టర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కెఇ ఈశ్వరప్ప, హోం మంత్రి ఆర్ అశోక్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా లేఖను సదానంద గౌడ బుధవారం సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై షెట్టర్ కూడా గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజను కలిసే అవకాశం ఉంది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే సమావేశాన్ని బహిష్కరిస్తామని సదానంద గౌడ వర్గానికి చెందిన 55 మంది శాసనసభ్యులు హెచ్చరించడంతో శాసనసభా పక్ష సమావేశం నాలుగు గంటల ఆలస్యంగా జరిగింది.
సదానంద గౌడను పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమించే విషయంపైనే కాకుండా ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంపై, సదానంద గౌడ వర్గానికి చెందిన శాసనసభ్యులకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇచ్చే విషయంపై రాజ్‌నాథ్ సింగ్, జైట్లీ హామీ ఇవ్వకపోవడంతో తొలుత ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి రాజీ కుదిరింది. దాంతో పరిస్థితి కొలిక్కి వచ్చి శాసనసభా పక్ష సమావేశం జరిగింది. గత నాలుగేళ్ల బిజెపి ప్రభుత్వంలో షెట్టర్ మూడో ముఖ్యమంత్రి అవుతున్నారు.












Click it and Unblock the Notifications