'రామాయణ' ఫేమ్, బాలీవుడ్ నటుడు దారాసింగ్ మృతి

పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకు వెళ్లమని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో ఆయనను ఇంటికి తీసుకు వెళ్లారు. ఆయన కోరిక ప్రకారం ఇంటిలోనే, కుటుంబ సభ్యుల నడుమ కన్నుమూశారు. హనుమంతుడి పాత్రలకు పెట్టింది పేరు. దూరదర్శన్‌లో వచ్చిన 'రామానంద సాగర్' రామాయణ సీరియల్‌లో హనుమంతుడి పాత్ర ధారి ఆయనే. ఈ పాత్ర ఆయనకు ఎంతో పేరు తీసుకు వచ్చింది.
దారాసింగ్ బాలీవుడ్‌లో 1963లో ఆరంగేట్రం చేశారు. ఆయన చివరి చిత్రం జబ్ వియ్ మెట్. సినిమాలలోకి రాకముందు ఆయన రెజ్లర్‌గా పేరు ప్రఖ్యాతులు గాంచారు. మొదటి నుండి రెస్లింగ్ అంటే ఆసక్తి. ప్రముఖ అంతర్జాతీయ రెస్లర్లలో ఒకడిగా పేరు గడించాడు. అయితే కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతో రెస్లింగ్ నుండి తప్పుకున్నాడు. బాలీవుడ్ కండల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఆయన అవతారమెత్తారు.
పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన ధారా సింగ్ వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. కొంతకాలంగా ఆయన పెరాలసిస్‌తోనూ బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన 2003 నుండి 2009 వరకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రాముఖ్యత తెలిసిన పలు పార్టీలు ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చేందుకు పోటీ పడేవని అంటారు.
దారా సింగ్‌కు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అతనిని ఆదర్శంగా తీసుకునే బాలీవుడ్ జనాలు ఉన్నారు. దారా సింగ్‌ది సున్నిత మనస్తత్వం. చాలామందికి ఆర్థికంగా, ఇతరత్ర రూపేణా సహాయం చేశారు. గుప్తదానాలు చేశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ విచారం వ్యక్తం చేస్తోంది. పలువురు నటులు ఆయనకు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications