తెలంగాణ: కెసిఆర్‌తో విభేదించిన కోదండ, నేతలకు లేఖ

రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ ఆకాంక్ష వ్యక్తీకరణకు వాడుకోవాల ని, ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఓటును ఆయుధంగా మలచుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఐకాస రాసిన లేఖను ఆయన గురువారం భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి విడుదల చేశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఐకాస ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ పై భాగస్వామ్య పార్టీల స్పందనపై ప్రశ్నించినప్పుడు.. తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటించటానికి ముందు అన్ని పార్టీలతో మాట్లాడామని, సహకరించే పార్టీలతో మళ్లీ ఇప్పుడు మాట్లాడతామని, ఐకాస అనేక సంఘాల సమాహారమని, ఎవరి అస్తిత్వం వారికి ఉంటుందని, కానీ తెలంగాణపై కలిసే పని చేస్తాయన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలను ఒక సందర్భంగా తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యక్తీకరించాలని మాత్రమే తాము ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను కోరుతున్నామని కోదండరాం తెలిపారు. అంతే తప్ప పదవులకు రాజీనామా చేయాలనో.. పార్టీలను వదులుకోవాలనో వారికి చెప్పట్లేదన్నారు. తెలంగాణపై తేల్చితే తప్ప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయబోమని వారు చెప్పవచ్చని తెలిపారు. తెలంగాణ విషయంలో పలు వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావులపై కోదండరాం మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన తెలంగాణ ఏర్పాటు హామీ అమలుకు సిఎం, కావూరి ప్రయత్నించాలని సూచించారు. పార్టీ సభ్యులుగా ఆ హామీకి వారు కట్టుబడాలని, లేకపోతే పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. కిరణ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఆయన సీమాంధ్రకే చవఎం అని ఇప్పటికే పలుమార్లు రుజువైందన్నారు. ఆయన తెలంగాణకు అడ్డుపడితే తాము ఆయనకు ఇందిర బాటకు అడ్డుపడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్లలో చేనేత సమస్యలపై ధర్నా చేస్తామని ప్రకటించడంపై ఐకాసాలో చర్చించి వైఖరి వెల్లడిస్తామన్నారు.












Click it and Unblock the Notifications