ప్రణబ్‌కు జగన్ మద్దతు: ఇరువురితో సబ్బం హరి భేటీ

దాదా రాంచీ నుండి ఆలస్యంగా రావడంతో సమావేశం ఈ రోజుకు వాయిదా పడింది. ఉదయం నారాయణ స్వామితే కలిసి సబ్బం హరి ప్రణబ్‌ను కలిశారు. నారాయణ స్వామి వెళ్లాక కూడా కాసేపు ప్రణబ్‌తో ఎంపీ చర్చలు జరిపారు. సబ్బం హరిగురువారం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఓటు విషయంలో జగన్ తన నిర్ణయాన్ని సబ్బం హరికి చెప్పడంతో అదే విషయాన్ని ఆయన దాదాకు చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఎప్పుడైనా వైయస్సార్ కాంగ్రెసు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముందని అంటున్నారు.
ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీ తనకు మద్దతివ్వాల్సిందిగా రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను కోరేందుకు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 1వ తేదిన ప్రణబ్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ తదితర రాష్టాలను ఆయన చుట్టి వచ్చారు.
మరోవైపు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తటస్థంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. పిఏ సంగ్మాకు మద్దతిస్తే మతతత్వ పార్టీ ప్రతిపాదించిన వారికి మద్దతిచ్చారని, ప్రణబ్‌కు మద్దతిస్తే బద్ద శత్రువు కాంగ్రెసు అభ్యర్థికి మద్దతిచ్చారనే ఆరోపణలు వినిపిస్తాయనే భావనతో టిడిపి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం తీసుకోనందున ప్రణబ్‌కు మద్దతివ్వకూడదని తెరాస భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications