పోలవరం టెండర్లపై సిఎంకు బాబు బహిరంగ లేఖ

పోలవరం టెండర్ల ఖరారులో స్వార్థ ప్రయోజానాలకే ప్రాధాన్యం ఇచ్చారని, ప్రజా ప్రయోజనాలకు గండి కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటి వరకు కాలువల నిర్మాణం కూడా పూర్తి కాలేదని ఆయన అన్నారు. 2012 టెండర్ల ఆమోదంపై అనుమానాలున్నాయని, అవకతవకలు జరిగాయని మంత్రులు కూడా అంటున్నారని, ఈ స్థితిలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ అసమర్థ వల్లనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు.
పోలవరం టెండర్లను వెంటనే రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్లీ టెండర్లు పిలిచి పారదర్శకంగా ఆమోదించాలని ఆయన అన్నారు. లేదంటే అఖిల పక్ష సమావేశం ముందు ఫైళ్లు పెట్టి టెండర్లను ఆమోదించాలని ఆయన సూచించారు. పోలవరం టెండర్ల ఖరారు తీరు వల్ల దాదాపు వేయి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆయన అన్నారు.
కొందరు కాంట్రాక్టర్లను రింగ్ చేయడంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన పాత్ర పోషించిందని ఆయన ఆరోపించారు. పోలవరం టెండర్లలో ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పోలవరం టెండర్ దక్కించుకున్న సోమాలో భాగస్వామిగా ఉన్న సిజిజిసి కంపెనీపై అనేక ఆరోపణలున్నాయని ఆయన అన్నారు. రెండు కంపెనీల బిడ్లు మాత్రమే ఎందుకు తెరిచారని ఆయన అడిగారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications