ఎనిమిదేళ్ల తర్వాత అనంతకు చమన్ రాక: సందేహాలు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడు చమన్ తన సొంత జిల్లా అనంతపురానికి వెళుతున్నట్లు గురువారం చెప్పిన విషయం తెలిసిందే. చమన్ ఎనిమిదేళ్ల తర్వాత జిల్లాకు వస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హడావుడి మొదలైంది. చమన్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఆయన సామాజికవర్గం నాయకుడు బాబూలాల్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పరిటాల రవీంద్ర నక్సల్స్ ఉద్యమంలో పని చేస్తున్న సమయంలోనే ఆయనతో చమన్‌కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఉద్యమం నుంచి పరిటాల రవి జనబాహుళ్యంలోకి రావడం... ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన అనంతరం చమన్ పరిటాల రవికి కుడి భుజంగా కొనసాగారు. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చమన్ పరిటాల ఆశీస్సులతో ఆ మండల టిడిపి కన్వీనర్‌గా పనిచేశారు. 2004ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
అప్పటికే పరిటాల, ఆయన ముఖ్య అనుచరులపై ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పరిటాల సూచన మేరకు 2004 జూన్‌లో చమన్ అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. చమన్ కోసం ఒకవైపు పోలీసులు, మరోవైపు ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో గాలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఇటీవలే ఆయన డిజిపి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.
చమన్‌పై ఉన్న కేసులన్నీ కొట్టివేయడంతో జిల్లాకు రావడానికి మార్గం సుగమమైంది. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చమన్ అనంతపురం జిల్లాకు రావడాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోకి ఆయనవస్తే తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందనే అభద్రతా భావంతో కొందరు కుట్రలుచేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం చమన్ జిల్లా రాకపై సందేహాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications