అన్నా టీమ్ పార్టీలోకి జయప్రకాష్ నారాయణ?

దేశంలో రాజకీయ మార్పు కోసం చేస్తున్న సుదూర పోరాటంలో లోకసత్తా ఇప్పటికే కొంత దూరం ప్రయాణించిందని, అన్నా హజారేకు సంపూర్ణ సహకారం అందించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమున్నత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా మనం చాలా ఏళ్లుగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నామని, భవిష్యత్తులో అవసరమైతే లక్ష్యం కోసం కలిసికట్టుగా మరింత శక్తిమంతంగా ప్రయత్నిద్దామని ఆయన అన్నారు. ఈ మాటలను బట్టి అన్నా టీమ్ రాజకీయాలకు జయప్రకాష్ నారాయణ సంపూర్ణ మద్దతు ఉంటుందనేది అర్థమవుతోంది.
అన్నా టీమ్ రాజకీయ పార్టీని పెడతామని ప్రకటించినప్పటికీ దాని పేరును ప్రకటించలేదు. ప్రజల నుంచే వారు పేరను కూడా కోరుతున్నారు. ఈ స్థితిలో లోకసత్తా పార్టీని నడిపిస్తున్న జయప్రకాష్ నారాయణ ఆ పార్టీని వదులుకుని అన్నా టీమ్ పెట్టే పార్టీలో చేరుతారా అనేది సందేహంగానే ఉంది. ఒకవేళ అన్నా టీమ్ పార్టీ పేరు కూడా అదే పెట్టుకుంటే మాత్రం మొదటి నుంచే జయప్రకాష్ నారాయణ అన్నా టీమ్‌తో కలిసి పనిచేస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అన్నా టీమ్ రాజకీయ పార్టీ పేరు వేరేది అయితే, జెపి అన్నా టీమ్ పార్టీలో చేరకుండా బయటి నుంచి మద్దతు ఇస్తూ కలిసి పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
గత ఎన్నికల్లో లోకసత్తా పెద్ద యెత్తున పోటీ చేసినప్పటికీ జయప్రకాష్ నారాయణ మాత్రమే గెలిచారు. ఆయన హైదరాబాదులోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన శాసనసభలోనే కాకుండా బయట కూడా ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. రైతు, ఇతర వర్గాల సమస్యలపై ఆయన నిరసన కార్యక్రమాలకు దిగారు.












Click it and Unblock the Notifications