సిఎం నిస్సహాయత: ఏ క్షణమైనా వారికి ఉద్వాసన?

వారికి ముఖ్యమంత్రి ఏ విధమైన హామీ ఇవ్వడం లేదు. కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని ఆయన వారికి చెబుతున్నారు. దీంతో మంత్రుల్లో గుబులు చోటు చేసుకుంది. తమకు ఉద్వాసన తప్పదనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. ధర్మాన ప్రసాద రావు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఆమోదం కోసం గవర్నర్ నరసింహన్‌కు పంపితే గానీ మిగతా మంత్రుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ఇదిలా వుంటే, ధర్మాన రాజీనామా వ్యవహారంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. ఢిల్లీలో రెంజు రోజుల పాటు అధిష్ఠానం పెద్దలతో ఆయన జరిపిన చర్చలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. కీలకమైన పర్యటనలు జరిపినప్పుడు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విషయాలు చెప్పి హైదరాబాదుకు తిరిగి రావడం ముఖ్యమంత్రికి పరిపాటి. కానీ ఈసారి అలా చేయలేదు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అది పూర్తయిన తర్వాత మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి వద్ద ధర్మాన వ్యవహారాన్ని, ఢిల్లీ విశేశాలను ప్రస్తావించారు. అయితే, వాటికి ఆయన ప్రతిస్పందించకుండా లేచివెళ్లి పోయారు. మీడియాకు ఏ విధమైన సమాచారం అందించకుండా కార్యరంగంలోకి దిగే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ ప్రక్షాళనపై ఆయన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్వాసన పలికే మంత్రులకు పార్టీలో ఏ విధమైన స్థానం కల్పించాలనే విషయంపై కూడా యోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరోసారి అధిష్టానంతో చర్చలకు ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications