నాలుకలు తెగ్గోస్తేనే తెలంగాణ: కాంగ్రెస్‌పై నారాయణ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణా పోరు యాత్ర పేరుతో శనివారం ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ కోసమే సిపిఐ ప్రజా పోరు యాత్రను చేపట్టిందని నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో నారాయణ కాంగ్రెసు నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. అవినీతి మంత్రులతో రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందని కిరణ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అవినీతి మంత్రులను కాపాడకునేందుకే 25మంది మంత్రులు లాబీయింగ్‌కు పాల్పడ్డారని నారాయణ ఆరోపించారు. తెలంగాణపై నాన్చుడి ధోరణికి స్వస్తి చెప్పి, వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఒక్క మంత్రి కూడా పని చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అవినీతి మంత్రులను బర్తరఫ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30న తెలంగాణ జెఎసి తలపెట్టిన ‘చలో హైదరాబాద్ మార్చ్'కు తాము సంపూర్ణ మద్దతునిస్తామని ఆయన ప్రకటించారు.
పాల్వంచ నుంచి ప్రారంభమయ్యే పోరు యాత్ర ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కరీంనగర్ , నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల మీదుగా వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర 26, 27 తేదీల్లో నల్లగొండ జిల్లాలో కొనసాగనుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయకత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర ఖమ్మం జిల్లాలో ముగించుకుని నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది.
ప్రజాపోరు యాత్ర ఆదివారం కోదాడలో మొదలై సూర్యాపేట, నకిరేకల్‌ల మీదుగా నల్లగొండకు చేరుకున్న అనంతరం గడియారం సెంటర్‌లో ధూంధాం.. కార్యక్రమంతోపాటు బహిరంగ సభ నిర్వహిస్తారు. సోమవారం మునుగోడు, నాంపల్లి, చింతపల్లిల నుంచి దేవరకొండ వరకు ప్రజాపోరు యాత్ర నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు పూర్తి చేశాయి.












Click it and Unblock the Notifications