వాకౌట్ చేస్తారు కదా!: టిడిపి నేతలపై గవర్నర్ సెటైర్

అప్పుడు గవర్నర్ మాట్లాడుతూ.. సమావేశపరిస్తే మీరు వాకౌట్ చేస్తారు కదా అని సెటైర్ వేశారు. అందుకు టిడిపి నేతలు కూడా ధీటుగానే స్పందించారు. వాకౌట్ అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న నిరసన ప్రక్రియ అని వారు అన్నారు. కాగా గవర్నర్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చే విధంగా ప్రభుత్వానికి సూచించాలని అలాగే కళంకిత మంత్రులపై సిఎం చర్యలు తీసుకునే విధంగా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
ప్రభుత్వానికి తాము ఇచ్చే చివరి అవకాశం ఇదేనని, కరెంట్ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని, సమావేశాలు నిర్వహించాలని మరో నేత ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం తమ నిర్ణయం చెప్పకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే కరెంట్ సంక్షోభం రాష్ట్రంలో ఇంత తీవ్రంగా ఉందని ఆరోపించారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతి రాజు శుక్రవారం పార్టీ శాసనసభా పక్ష సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెసు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వారన్నారు. మంత్రి ధర్మానది ఉత్తుత్తి రాజీనామా అని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. మంత్రులు జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తాము రాజీనామా చేయాల్సి వస్తుందనే భయంతో కళంకిత మంత్రులు ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులు పంటలపై పెట్టుబడులు పెట్టి విద్యుత్తు లేక అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలంటే పోలీసు స్టేషన్లో ఇవ్వాల్సి వస్తుందని ఆయన అన్నారు. రైతులకు గంటల పాటు విద్యుత్తు ఇవ్వలేకపోతే ఎన్ని నిమిషాలు ఇస్తారో చెప్పాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేక చిన్నపిల్లలు చనిపోతున్నారని ఆయన అన్నారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో బీసీ విద్యార్థులకు సీలింగ్ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. సమస్యలపై చర్చకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలపై చర్చిద్దామంటే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆయన అన్నారు.
సచివాలయంలో నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుకు తన ప్రాణాలు పోయి ఉండేవని, కాలో చేయో విరిగి ఉండేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. దేవుడే తనను కాపాడాడని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొంగలకు కాపలా కాస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్తుపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నారు. సచివాలయంలో ధర్నా చేయడం నేరం కాదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడైనా ఎక్కడైనా ఆందోలన చేయవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications