నారా లోకేష్ జోరు: తెర వెనక కాదు, తెర ముందే

నారా లోకేష్‌కు భద్రత కల్పించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తనకు భద్రతా ఏర్పాట్లు చేయాలని నారా లోకేష్ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. తెర వెనక పాత్ర నిర్వహించదలుచుకుంటే భద్రతా ఏర్పాట్లు అవసరం లేదని, తెర ముందుకు రావాలనీ ప్రజల మధ్య తిరగాలనీ అనుకుంటున్నారు కాబట్టే భద్రత కోసం విజ్ఞప్తులు పంపించారని ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికే లోకేష్ సిద్ధపడ్డారని చెప్పడానికి ఈ పరిణామం ఉదాహరణ అని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్‌కు సెక్యూరిటీ ఉండేది. ఆ తర్వాత తనకు సెక్యూరిటీ అక్కరలేదని 2007లో భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించారు. ఇప్పటి వరకు ఆయనకు ఏ విధమైన ప్రభుత్వ భద్రత లేదని అంటున్నారు. తాను పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని నారా లోకేష్ చెప్పారు. పదవులు ఉన్నా, లేకున్నా చంద్రబాబు కుమారుడు కాబట్టి పదవిలో ఉన్నట్లే ఆదరణ, గౌరవం లభిస్తాయి. అందువల్ల ఏ పదవీ లేకుండానే ఆయన కొంత కాలం చురుగ్గా పనిచేస్తుండవచ్చునని అంటున్నారు.
నిజానికి, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకించడంతో నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశంలో జాప్యం జరిగింది. బాలకృష్ణ క్రియాశీలకంగా పాల్గొంటూ ముందుకు వచ్చి, నారా లోకేష్ ప్రవేశానికి మార్గం సుగమం చేశారని అంటున్నారు. బాలకృష్ణ తన అల్లుడి కోసం పావులు కదిపినట్లు చెబుతున్నారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగే ప్రచారానికి వస్తే వాడుకుంటారు, లేదంటే ఆయన పార్టీకి దూరమైనట్లేనని అంటున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ముందుకు వస్తోంది.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి, లేదంటే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications