ఓయు ఉద్రిక్తం: రాళ్ల వర్షం, బాష్పవాయు ప్రయోగం

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, జై తెలంగాణ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అసెంబ్లీ వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో వారి పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు విద్యార్థుల పైకి బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులు కాలం చెల్లిన బాష్పవాయువును 15 రౌండ్లు టిజివిపి విద్యార్థుల పైకి ప్రయోగించారు. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
కొందరు విద్యార్థులు పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ వైపుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. విద్యార్థులు మరింత ఆగ్రహం చెంది గో బ్యాక్ పోలీసులు అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. వారి మాత్రం అసెంబ్లీని ముట్టడించి తీరుతామని చెబుతున్నారు. దీంతో ఎన్‌సిసి గేటు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.
అంతకుముందు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, కొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో విద్యార్థులు పోలీసులు వాగ్వాదానికి దిగారు.
వరంగల్‌లో ఉద్రిక్తత
మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు హన్మకొండలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications