konda surekha ys jagan telangana ysr congress warangal కొండా సురేఖ వైయస్ జగన్ తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు వరంగల్
కెసిఆర్‌కు కౌంట్‌డౌన్, సోనియా జపం: కొండా సురేఖ

తెలంగాణ తెస్తామని కల్లబొల్లి మాటలతో కెసిఆర్ కాలం గడుపుకుంటున్నాడని విమర్శించారు. అసలు రాష్ర్ట ఏర్పాటుకు ఆయనే అడ్డంకి అని ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచనానికి బదులు.. కెసిఆర్ విమోచన దినంగా పాటించాలని వారు పిలుపునిచ్చారు. 100 రోజుల్లో తెలంగాణ అని ప్రకటించిన కెసిఆర్.. ఇంకా ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో హరీశ్ రావు అంబాడినప్పటికీ గీసుకొండ ప్రజలు తమనే ఆదరించారని అన్నారు.
గీసుకొండలో సురేఖకు మెజారిటీ ఇచ్చి హరీశ్ రావుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. దొరల పెత్తనంపైనే కొండా దంపతుల పోరాటమన్నారు. సిబిఐ దాడుల నుంచి రక్షించుకునేందుకే కెసిఆర్.. సోనియా గాంధీ జపం చేస్తున్నారని కొండా మురళి ఎద్దేవా చేశారు. 800 మంది ప్రాణత్యాగాలకు కారకుడు కెసిఆరే అని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ రాష్ట్రంతో వస్తే తెలంగాణ గాంధీగా సన్మానిస్తానని పేర్కొన్నారు. సూట్‌కేసులతో వస్తే మాత్రం గాడిదలా అభివర్ణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం కొండా సురేఖ ప్రసంగిస్తూ పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 40వేలు, 20వేలు, 10వేల మెజారిటీ అంటూ దిగజారుడుగా మాట్లాడినా.. చివరకు 2 వేల మెజారిటీ కూడా రాలేదన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంతో అర్థమవుతోందన్నారు. నైతిక గెలుపు తనదేనని పేర్కొన్నారు. పదవులకు తాము ఎపుడు ఆశపడలేదన్నారు. అలా ఆశపడితే కిరణ్ ప్రభుత్వంలో కొనసాగేవాళ్లం అన్నారు. మాటకు కట్టుబడి ఉండే నైజం తమదని ఉద్ఘాటించారు.
సకల జనుల సమ్మెను తాకట్టుపెట్టిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. అటువంటి కెసిఆర్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విమర్శించే నైతికత లేదన్నారు. నవంబర్ 2 తర్వాత తెలంగాణ భవన్‌ను ముట్టడిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా దొంగమాటలు కట్టిపెట్టి తెలంగాణ తన వల్ల సాధ్యం కాదని కెసిఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.