ఉక్కపోస్తోంది: బిజెపికి యడ్యూరప్ప గుడ్‌బై?

డిసెంబర్ నెలాఖరులో రెండో విడత పర్యటన ముగిసిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. డిసెంబర్ 27వ తేదీన జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాకపోవచ్చునని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు.
తన ద్వారా ముఖ్యమంత్రి అయిన జగదీష్ షెట్టర్ ప్రభుత్వం బీటలు వారుతుందనే తాను తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. తాను పార్టీలో ఏ పదవినీ ఆశించడం లేదని, పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కూడా తనకు అవసరం లేదని ఆయన అన్నారు. తనకు పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని ఒప్పించేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేయవద్దని తాను తన అనుచరులకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
అధిష్టానం చెప్పినా తాను పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవడానికి సిద్ధంగా లేనని ఆయన అన్నారు. రెండో సారి ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రజల ఆశీస్సులతో అవుతానని ఆయన అన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై లోకాయుక్త రూపొందించిన నివేదికలో ఆరోపణలు చోటు చేసుకోవడంతో యడ్యూరప్ప నిరుడు జులై ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాను అధికార పార్టీ సభ్యుడిగానూ ప్రతిపక్ష సభ్యుడిగానూ పనిచేస్తున్నానని ఆయన అన్నారు. తాను రానున్న కాలంలో 50 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. దక్షిణాదిలో తొలి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తాను ఎంతో శ్రమ పడ్డానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications