సమైక్యవాదులు తెలంగాణ గడ్డ మీద ఉండొద్దు: యాష్కీ

తెలంగాణ మార్చ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు మద్దతు ప్రకటించారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విమలక్కను వెంటనే విడుదల చేయాలని కేకే డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖలు తెలంగాణకు సరిపోదని, మంత్రులు ఉద్యమంలో ముందు ఉండాలని అన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. జాప్యం చేస్తే పార్టీకి, ప్రజలకు నష్టమని ఆయన అన్నారు.
ఢిల్లీకి బయలుదేరే ముందు తెలంగాణ కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర స్పాన్సర్డ్ ఉద్యమమని వారు విమర్శించారు. ఆ ఉద్యమాన్ని కొందరు పెట్టుబడిదారులు పెంచి పోషిస్తున్నారని వారన్నారు. సమైక్యాంధ్ర అనేవారికి తెలంగాణలో స్థానం లేదని వారన్నారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న అరెస్టులను వారు ఖండించారు. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తోందని వారు విమర్శించారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీ కోర్ కమిటీ సభ్యులను కలుస్తారు.
తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ధ్వంసం కేసులో అరెస్టయిన విమలక్కను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications