భార్యాభర్తలు అయిన అక్కాతమ్ముళ్లు.. వీడియో వైరల్ !
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక వింత వివాహం సంచలనం సృష్టించింది. కుటుంబ బంధాలు, రక్తసంబంధాలు, సంప్రదాయ విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వరుసకు అక్కాతమ్ముళ్లు అయ్యే ఇద్దరు ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకోవడం.. అనంతరం ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వ్యవహరం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన ప్రవీణ్, శశికళ అనే యువతి యువకులు ఈ ఘటనలో కేంద్రబిందువుగా నిలిచారు. వీరిద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో, కుటుంబ పరంగా వీరు అక్కాతమ్ముళ్లు అవుతారు. చిన్నప్పటి నుంచే ఒకే కుటుంబ వాతావరణంలో పెరిగిన వీరి మధ్య కాలక్రమేణా స్నేహం ప్రేమగా మారినట్లు సమాచారం. కాగా ప్రవీణ్ కంటే శశికళ వయసులో పెద్దది అయినప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ తమ బంధాన్ని కొనసాగించారు. అయితే ఇటీవల శశికళకు ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండటంతో భయపడిన ఈ జంట, ఇంటి నుంచి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్లు సమాచారం.
ఈ ఘటన తెలిసిన వెంటనే ఇరు కుటుంబాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంధువులు, గ్రామస్థులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబ పరంగా అన్నాచెల్లెల్లుగా భావించే బంధంలో ఉన్న వారు ఇలా వివాహం చేసుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు "ఇది వ్యక్తిగత నిర్ణయం" అని భావిస్తుండగా, మరికొందరు "కుటుంబ విలువలకు విరుద్ధమైన ఘటన"గా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రక్తసంబంధాల విషయంలో సంప్రదాయాల ప్రాధాన్యత, సామాజిక పరిమితులపై చర్చ మొదలైంది.
పోలీసులు ప్రస్తుతం జంట భద్రతపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే ఇరు కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ కూడా నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రేమ, కుటుంబ బంధాలు, సామాజిక విలువల మధ్య నెలకొనే సంక్లిష్ట పరిస్థితులను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications