రేపు ప్రమాణస్వీకారం కష్టమేనా.. TVK విజయ్‌కి మళ్లీ బిగ్ షాక్ !!
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హైడ్రామా మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో అధికారానికి చేరువైన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌కు ఇప్పుడు సంఖ్యాబలం సవాలుగా మారింది. తొలుత మద్దతు ప్రకటించిన మిత్రపక్షాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పూర్తి మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు ప్రకటించగా, వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో కూడా చర్చలు జరిగాయి.

అయితే తాజా రాజకీయ పరిణామాలు టీవీకే శిబిరంలో ఆందోళన పెంచుతున్నాయి. మొదట టీవీకేకు మద్దతు ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనూహ్యంగా వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరోవైపు మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించిన వీసీకే పార్టీ నుంచి గవర్నర్‌కు ఇప్పటివరకు అధికారిక లేఖ చేరలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం టీవీకే బలం 116 వద్దే నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరమవడంతో విజయ్ శిబిరం కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీల నేతలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రాజకీయ అనిశ్చితి కారణంగానే గవర్నర్ ఇప్పటివరకు అధికారికంగా విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించలేదని సమాచారం. రాజ్‌భవన్ కూడా పూర్తి స్థాయి మద్దతు పత్రాలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఇక మరోవైపు డీఎంకే కూడా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. టీవీకేకు స్పష్టమైన మెజారిటీ రాకపోతే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పార్టీల ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో తమ వైఖరి మార్చే అవకాశమూ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దాదాపు ఖాయమనే వాతావరణం కనిపించినా, తాజా పరిణామాలతో పరిస్థితి మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో వచ్చే 24 గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి గవర్నర్ నిర్ణయం, టీవీకేకు లభించే అదనపు మద్దతుపైనే నిలిచింది.












Click it and Unblock the Notifications