తెలంగాణ: వాయలార్‌తో కెసిఆర్, నేతలతో చంద్రబాబు

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం ఆలోచించడం లేదని ప్రకటించిన నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వాయలార్ రవితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. ముందు నిర్ణయించుకున్న మేరకే వీరిరువురి భేటీ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణపై విస్తృత స్థాయిలో వారు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఆలోచనను తెలుసుకోవడానికి కెసిఆర్ వాయలార్ రవి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

కెసిఆర్‌తో తెలంగాణపై, తెరాస విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కూడా విస్తృతంగా వార్తలు వస్తున్న నేఫథ్యంలో కాంగ్రెసు అధిష్టానం నుంచి తెలంగాణ వ్యతిరేక సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణపై ఏమీ జరగడం లేదని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణపై ప్రకటన చేయాలంటే రాష్ట్రానికి చెందిన పార్టీలతో అఖిల పక్ష సమావేశం పెట్టాల్సి ఉంటుందని, యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించాల్సి ఉంటుందని, అందువల్ల ఇప్పటికిప్పుడు తెలంగాణపై కేంద్రం నుంచో, పార్టీ అధిష్టానం నుంచో ప్రకటన రావడం సాధ్యం కాదని అంటున్నారు.

కాగా, పార్టీ తెలంగాణ, సీమాంధ్ర నాయకులకు కాంగ్రెసు అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణపై ఒత్తిడి తేవద్దని వారిని అధిష్టానం ఆదేశించింది. ఇదిలావుంటే, కెసిఆర్ రేపు లేదా ఎల్లుండి హైదరాబాదుకు తిరిగి రావచ్చునని అంటున్నారు. కాంగ్రెసు అధిష్టానం నుంచి ఓ స్పష్టత వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాయలార్ రవి చెప్పే విషయాల ఆధారంగానే ఆయన ఢిల్లీ పర్యటన ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కెసిఆర్ ఢిల్లీ వెళ్లి 20 రోజులు అవుతోంది. ఇంత కాలం ఆయన ఢిల్లీలో ఉండడం ఇదే మొదటిసారి కావచ్చు.

తెలంగాణపై ఏదీ జరగకపోతే కెసిఆర్ ఢిల్లీలో ఎందుకుంటారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల అన్నారు. దీన్నిబట్టి కెసిఆర్‌తో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చర్చలు చేస్తున్నారనే భావించాల్సి ఉంటుంది. అయితే, ఈ నెల 30వ తేదీలోగా మాత్రం తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆశించే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ స్థితిలో వాయలార్ రవితో కెసిఆర్ మంగళవారం సాయంత్రం 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. సమావేశం వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించకుండా ఆయన వాయలార్ రవి వద్ద నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై తుది కసరత్తు ప్రారంభించారు. రెండు రోజుల్లో తెలంగాణపై స్పష్టత ఇస్తానని చెప్పిన ఆయన అందుకు పార్టీ నేతలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించారు. ఈసారి ఇరు ప్రాంతాల నాయకులను ఒకేచోట కూర్చోబెట్టి ఆయన చర్చలు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇరు ప్రాంతాల ఉమ్మడి సమావేశాన్ని హైదరాబాదులోని తన నివాసంలో నిర్వహించారు.

తెలంగాణకు అనుకూలంగానే చంద్రబాబు ప్రకటన వెలువడుతుందని, తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుతో మంగళవారం సాయంత్రం సీమాంధ్రకు చెందిన సీనియర్ నేతలు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, తెలంగాణ ప్రాంత నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన దాదాపు 15 మంది నాయకులు ఈ సమావేశానికి వచ్చారు. రేపు సాయంత్రంలోగా తెలంగాణపై స్పష్టత ఇస్తామని సమావేశానంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+