తెలంగాణపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లేనా?

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై తెలంగాణవాదుల నుంచే కాకుండా కాంగ్రెసు పార్టీ నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. నిజానికి, చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ అదనపు ప్రయోజనం చేకూర్చకపోగా, ఆయనకే ఎదురు తిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానికి రాసిన లేఖలో తాము 2008లో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖను ప్రస్తావించారు.

అయితే, తాము 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటామని ఆయన ఆ లేఖలో ఎక్కడా చెప్పలేదు. అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని మాత్రమే ఆయన డిమాండ్ చేశారు. తమ వైఖరిని అఖిల పక్ష సమావేశంలో చెప్తామని ఆయన తెలిపారు. తాజాగా, ఆయన మాటలు చూస్తుంటే తెలంగాణ అంశాన్ని ఆయన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే స్థితిలోనే ఉంచారని స్పష్టమవుతుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించే పాదయాత్రను పురస్కరించుకుని ఆయన వివిధ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.

మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణపై కూడా మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని చెప్తారా అని అడిగితే సమావేశం పెట్టినప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఇంత అయాచితంగా ఎలా సమాధానమిచ్చారనే ప్రశ్న ఎదురు కావచ్చు. అయితే ఆయనకు అంతకు మించిన ప్రత్యామ్నాయం కూడా లేదని అనుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

చంద్రబాబు సమాధానాన్ని బట్టి తెలంగాణ అంశంపై ఆయన అదనంగా ఇచ్చిన స్పష్టత ఏమీ లేదని అర్థమవుతోందని అంటున్నారు. చంద్రబాబు తన లేఖ ద్వారా తెలంగాణపై మరింత అస్పష్టత ఇచ్చారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలాంటివాళ్లు విమర్శిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని కాంగ్రెసు నాయకులు కూడా తప్పు పట్టడం చూస్తుంటే చంద్రబాబు ఎంతగా ఆత్మరక్షణలో పడ్డారో అర్థమవుతుందని అంటున్నారు.

తెలంగాణపై వైఖరి చెప్పాలని కాంగ్రెసుపై ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షం తానే ఆత్మరక్షణలో పడడం విచిత్రమే. అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకుంటే, దాన్ని సమర్థించడమో, బలపరచడమో చేయాల్సిన తెలుగుదేశం పార్టీ తానే నిర్ణయం వెల్లడించాల్సిన అనివార్యతలో పడడం ఆశ్చర్యకమే. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ వల్ల కొంత మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖవల్ల పోగొట్టుకుందే ఎక్కువ ఉందని, వచ్చింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడానికే చంద్రబాబు లేఖ రాశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వంటి నాయకులు అంటుండగా, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు అంటున్నారు. చంద్రబాబు లేఖ కాంగ్రెసును ఇరకాటంలో పెట్టినట్లు కూడా ఏమీ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+