టార్గెట్ 14: పాదయాత్ర ముగియగానే మళ్లీ బాబు టూర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వస్తుండటంతో 2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

బాబు వస్తున్నా నీకోసం యాత్రను 117 రోజుల పాటు చేసి 2200 కిలోమీటర్లు తిరగనున్నారు. వందకు పైగా నియోజకవర్గాలను చుట్టి వస్తారు. బాబు యాత్రకు ప్రజాస్పందన బాగుండటంతో టిడిపి మరో యాత్రకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ రెండో తేదిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర 2013 జనవరి 26 ముగుస్తుంది.
యాత్ర ముగియగానే బాబుకు కొద్ది నెలలు రెస్ట్ ఇచ్చి మరో పాదయాత్రను చేపట్టేలా చూడాలని టిడిపి సీనియర్ నేతలు చూస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే వారు అధినేతతో మాట్లాడారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. రెండో విడత యాత్రను మార్చ్ 29న చేపట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.
రెండు నెలల పాటు మే 28 వరకు ఈ పాదయాత్ర ఉండాలని టిడిపి వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తిరిగిన నియోజకవర్గాలు కాకుండా కొత్త నియాజకవర్గాలలో పాదయాత్రను ప్లాన్ చేయాలని చూస్తున్నారట. అందుకోసం ఇప్పటి నుండే రూట్ మ్యాప్ పైన పలువురు దృష్టి సారించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications