జగన్‌కు జైలే: సుప్రీంలో షాక్, సంపాదనపై జడ్జి ప్రశ్న

ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు.
జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
జగన్ న్యాయవాదికి కోర్టు ప్రశ్న
అంతకుముందు వాదనలు వినిపించిన జగన్ న్యాయవాది అరెస్టు అక్రమమని, రాజకీయ కారణాలతో జైలుకు పంపించారని ఆరోపించారు. దీనికి స్పందించిన జడ్జి.. జగన్ అతి తక్కువ కాలంలో ఇంత ఆస్తిని ఎలా సంపాదించారని జగన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అలాగే పది రూపాయల ముఖ విలువ కలిగిన షేర్‌లను రూ.350 ఎలా అమ్మారో చెప్పాలని ప్రశ్నించారు.
సిబిఐకి డెడ్ లైన్
జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది.
కాగా అంతకుముందు జగన్ న్యాయవాది తన వాదనలు వినిపించారు. జగన్ అరెస్టు అక్రమమని చెప్పారు. జగన్ నేరస్తుడు అని చెప్పడానికి సిబిఐ ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. అరెస్టు చేసి 130 రోజులు దాటిందని, అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఒక పార్టీ అధినేత ఇన్న రోజులు జైలులో ఉండటం సరికాదన్నారు.
జగన్ కాంగ్రెసులో ఉన్నంత కాలం ఎవరూ అతనిని అవినీతిపరుడు అని చెప్పలేదని, పిటిషన్ వేసిన శంకర రావు ఆ తర్వాత మంత్రి అయ్యారని, వీటిని అన్నింటిని చూస్తుంటే రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయన్నారు. బయటకు వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని చెప్పడం సరికాదన్నారు. శంకర రావు పిటిషన్ ఆధారంగా ఇదంతా జరిగిందన్నారు. కోర్టుకు రావాల్సిన వ్యక్తిని సిబిఐ ఉద్దేశ్య పూర్వకంగా అరెస్టు చేసిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications