షర్మిల ఆరంభిస్తే జగన్ కొనసాగిస్తారు!: విజయమ్మ

ఈ పాదయాత్రను జగన్ చేపట్టాలనుకున్నారని కానీ, ఆయన జైలుకు వెళ్లడంతో షర్మిల చేపట్టేందుకు సిద్ధపడిందని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా తనను వద్దని పార్టీలోని పెద్దలు సూచించారన్నారు. జగన్ స్థానంలో ఎవరో ఒకరు పాదయాత్ర చేయాలని చర్చించుకుంటున్న సమయంలో షర్మిల అందుకు సిద్ధపడ్డారన్నారు. పాదయాత్ర మధ్యలో తాను, జగన్ సతీమణి భారతి రెడ్డి అప్పుడప్పుడు పాలు పంచుకుంటామన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. అందుకే ఆయన ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తారన్నారు. త్వరలో రోడ్డు మ్యాప్ వస్తుందని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో కూడా యాత్ర ఉంటుందని చెప్పారు. చంద్రబాబు యాత్రకు తమ యాత్రకు తేడా ఉంటుందన్నారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం లేదని, కానీ తమ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు.
చంద్రబాబుపై విశ్వాసం లేదు
రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని విజయమ్మ అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా అర్థం కాకుండా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల తన పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని, ఆయన ఇప్పుడు ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి మాత్రమే వెళ్తున్నారన్నారు. కానీ వైయస్ వారసులుగా తమకు ప్రజల కష్టాలు ఎప్పుడో తెలుసునని, మరోసారి వెళ్తున్నామన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఎవరైనా నమ్ముతారన్నారు. జగన్ అయినా, షర్మిల అయినా ఎవరైనా ప్రజలకు విశ్వాసం ఉంటుందన్నారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే అన్నారు. పాదయాత్ర ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుందన్నారు. పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు ఉంటుందన్నారు. 18న ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. వైయస్ పథకాలు అటకెక్కాయని, ధరలు కొండెక్కి కూర్చున్నాయన్నారు.
మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, వైయస్ సువర్ణయుగం వస్తుందని విజయమ్మ అన్నారు. చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకముందు అవిశ్వాసం పెట్టని బాబు ఆ తర్వాత పెట్టడం కాంగ్రెసుతో కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదో చెప్పాలన్నారు. టిడిపి, కాంగ్రెసులు కలిసి జగన్‌ను వేధిస్తున్నాయన్నారు.
రూట్ మ్యాప్ ఇలా...
షర్మిల పాదయాత్రను ఈ నెల 18న విజయమ్మ ప్రారంభిస్తారు. ఈ యాత్రలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనే అవకాశముంది. ఇడుపులపాయ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వరకు సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది.


Click it and Unblock the Notifications