జగన్ కేసు: మరిన్ని ఆస్తుల జప్తునకు ఈడి రెడీ?

'జగన్ అండ్ కో'కు సంబంధించి రూ.51 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఈనెల 4న జప్తు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు ఆస్తుల జప్తు జరిగిన నెలలోపు అడ్జుడికేటింగ్ అథారిటీలో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోపే దీనిపై కేసు దాఖలు చేయనున్నట్లు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మూడు చార్జ్‌షీట్లు, వాటి అనుబంధ పత్రాలు తీసుకున్న ఈడీ అధికారుల చేతికి వాన్‌పిక్‌పై దాఖలైన నాలుగో చార్జిషీటు ప్రతి కూడా రానుంది.
వాన్‌పిక్ చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలను ఇవ్వాల్సిందిగా ఈడీ చేసుకున్న విన్నపాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు మన్నించింది. వాటిని ఇచ్చేందుకు అంగీకరించింది. వాన్‌పిక్ వివాదంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా నిందితుడిగా సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు జగన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణలను ఇప్పటికే ప్రశ్నించారు. ఇప్పుడు ధర్మాన వంతు రానుంది. నాలుగో చార్జిషీటును పరిశీలించిన తర్వాత ఇప్పటికే జైలులో ఉన్న నిందితులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్లు వేయనుంది.
ఓఎంసీ, ఎమార్, జగతి కేసుల్లో పీఎంఎల్ఏ (మనీలాండరింగ్)-2002, ఫెమా-1999 చట్టాల ఉల్లంఘనలపై ఈడీ దృష్టి పెట్టింది. ఆయా కేసుల్లో నిందితులను ప్రశ్నించేందుకు మే నెలలో అనుమతి కోరినపుడు ఈడీకి తాము చెప్పాల్సింది ఏమీ లేదని, తమ వద్ద తగిన సమాచారం కూడా ఏమీ లేదని నిందితులు అభ్యంతరం చెప్పారు. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిని ప్రశ్నించేందుకు ఈడీని అనుమతించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications