ఓదార్పులా షర్మిల పాదయాత్ర కొనసా...గుతుందా!?

అయితే సాధారణ ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున షర్మిల పాదయాత్ర పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలాగే కొనసా...గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. గత కొంతకాలంగా జగన్ పార్టీ సెంటిమెంట్‌తోనే నెట్టుకొస్తోంది. ఇప్పుడు జగన్ జైలులో ఉన్న కారణంగా షర్మిల పాదయాత్ర చేపడుతున్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను అలాగే ఉంచి క్యాష్ చేసుకోవాలంటే షర్మిల పాదయాత్రను మెల్లిగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర జనవరి 26న ముగుస్తుంది. ఆ తర్వాత రెండో విడద పాదయాత్రకు కూడా టిడిపి నేతలు ఇప్పటికే అధినేతను సిద్ధం చేశారు. రెండో విడతగా ఆయన రెండు నెలలు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారు. షర్మిల తన యాత్రను ముగించుకొని మళ్లీ రెండో విడత అంటూ చేపడితే అది బాబును అనుకరించినట్లుగా ఉంటుంది.
దీంతో ఆ మూడువేల కిలోమీటర్ల యాత్రనే మెల్లిగా కొనసాగించే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయారంటూ వైయస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర జైలుకు వెళ్లే ముందు వరకు కొనసాగింది. జైలుకు వెళ్లని పక్షంలో ఆయన ఇంకా కొనసాగించేవారు. అంతేకాదు జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ఆయన తన ఓదార్పు యాత్రను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
ఓదార్పు యాత్రనే ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షర్మిల పాదయాత్రను కూడా సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగా తమకు అవసరం ఉన్నంత మేర సాగదీస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే షర్మిల మరో ప్రజా ప్రస్థానం ఎనిమిది నెలల నుండి సంవత్సరం వరకు కొనసాగినా కొనసాగవచ్చునని చెబుతున్నారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికలకు తెరలేస్తుంది. దీంతో వెంటనే ప్రచారం మునిగి పోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications