జగనన్న వదిలిన బాణాన్ని, నన్ను పంపారు: షర్మిల

"నేను మీ రాజన్న కూతురిని. నేను మీ జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల" అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైయస్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా క్షోభ పెడుతోందని ఆమె విమర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేసిందని, విద్యార్థులను దెబ్బ తీసిందని, విద్యుత్ సంక్షోభం ఘోరంగా ఉందని ఆమె అన్నారు. తాను రెండు ఉద్దేశాలతో ఈ పాదయాత్రను చేస్తున్నానని, ఒకటి - ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, రెండోది - అసమర్థ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకపోవడాన్ని ప్రశ్నించడమని ఆమె అన్నారు.
ప్రజలు ఇబ్బంది పడుతుంటే మూడేళ్లుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన రెండు హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేదని ఆమె అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ రెండు హామీలను కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని ఆమె అన్నారు.
చంద్రబాబు వ్యవసాయం దండుగన్నారని, తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు విపరీతంగా విద్యుత్ చార్జీలు పెంచారని, బిల్లులు చెల్లించాలని రైతులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టారని, రైతులపై కేసులు పెట్టారని, వారిని జైల్లో పెట్టించారని, రైతుల సామాన్లు ఎత్తుకుపోయారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె అంటూ రైతుల ఆత్మహత్యల పాపం చంద్రబాబుది కాదా అని షర్మిల అడిగారు.
చీకట్లో చిదంబరాన్ని కలిశారు.
చంద్రబాబు ఎల్లో డ్రామాకు తెర లేపారని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ రోజు రైతుల కోసం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకి గానీ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయి జగనన్నపై కేసులు పెట్టించారని, జగనన్నను జైల్లో పెట్టించారని ఆమె ఆరోపించారు. చీకట్లో చంద్రబాబు చిదంబరాన్న కలిసి తనపై కేసులు లేకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకున్నారని ఆమె అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఇటీవలి ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెసు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెసు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చుకున్నాయని ఆమె అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తీరు ఆ విషయాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.
రెండే పార్టీలు ఉండాలట
"ఈ రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలట. ఉంటే కాంగ్రెసు, లేకుంటే తెలుగుదేసం ఉండాలట. మూడో పార్టీ ఉండకూడదట. అందుకు ఎన్ని కుట్రలైనా చేస్తారు. ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు" అని షర్మిల అన్నారు. ప్రజా సమస్యలను తన సమస్యగా జగనన్న భావించి స్పందించారని, దీక్షలు చేశారని, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం చేయాల్సిన పనిని జగన్ చేయడానికి ప్రయత్నించారని, దాంతో జగన్ ప్రజల ఆదరణ పొందుతున్నారని గుర్తించి ప్రజల మధ్యన లేకుండా చేయాలని కుట్రలు చేశారని, కేసులు పెట్టారని ఆమె అన్నారు.
సిబిఐని వాడుకుని కాంగ్రెసు, టిడిపి విచారణ పేరుతో జగన్‌ను అరెస్టు చేయించాయని ఆమె ఆరోపించారు. మొన్నటికి మొన్న బెయిల్ వస్తుందనగా చంద్రబాబు తన ఎంపిలను చిదంబరం వద్దకు పంపించారని, పాదయాత్ర చేస్తున్నారు కదా చంద్రబాబు ప్రజా సమస్యలపై తన ఎంపిలను చిదంబరం వద్దకు పంపించారని అనుకుంటే తప్పు అని, కోర్టును ప్రభావితం చేయడానికి జగన్‌కు బెయిల్ రాకుండా చూడడానికి, జగన్ ఆస్తుల జప్తునకు ఈడిని ఉసిగొల్పడానికి చంద్రబాబు తన ఎంపిలను చిదంబరం వద్దకు పంపించారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications